టాలీవుడ్ మన్మథుడిగా పిలుచుకునే హీరో నాగార్జున కుమారుల వివాహ జీవితం చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా చై–సామ్ జంట విడిపోయిందనే ప్రచారానికి నేటితో క్లారిటీ వచ్చింది. “ఔను…మేమిద్దరం విడిపోతున్నాం” అని చై-సామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ విషయం తెరపైకి వచ్చింది.
అక్కినేని నాగార్జున-అమల దంపతుల కుమారుడు, యువ హీరో అఖిల్ పెళ్లి పెటాకులు కావడంపై తెలుగు సమాజంలో చర్చ జరుగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే సంస్థల యజమాని మనవరాలు శ్రీయభూపాల్తో అఖిల్ వివాహ నిశ్చయమైన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
అఖిల్, శ్రీయ పెళ్లిపై చర్చ జరుగుతుండగా, ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీడియాలో ప్రచారమైన వార్తే చివరికి నిజమైంది. పెళ్లి రద్దు చేసుకున్నట్టు ఇరువైపు కుటుంబాల నుంచి ప్రకటన రావడం తెలిసిందే.
నిజానికి అప్పట్లో అఖిల్-శ్రీయ భూపాల్ పెళ్లి ఇటలీలో చేయాలని ఇరువైపు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. కానీ కొత్త జీవితాన్ని ప్రారంభించే ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో, ఏడడుగులు నడవకుండానే, పెళ్లి కథ ముగిసింది.
తాజాగా, ఇక నుంచి తాము భార్యభర్తల బంధానికి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు చై-సామ్ ప్రకటించడం గమనార్హం. దీంతో అక్కినేని కుటుంబంలో పెళ్లి బంధాలపై సర్వత్రా చర్చకు దారి తీసింది. తమ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని చైతన్య, సమంత మీడియాకు విజ్ఞప్తి చేశారు.
సినీ సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరిగినా చర్చనీయాంశమే కదా! మీడియా ఒక ఇప్పట్లో ఈ విషయాన్ని విడిచి పెడుతుందా అంటే, అనుమానమే అని చెప్పాలి.