‘మా’ ఎన్నికల్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ‘మా’ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్టు గత కొంత కాలంగా కమెడియన్, నిర్మాత బండ్ల గణేశ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే.
పోటీ నుంచి తప్పుకున్నట్టు శుక్రవారం ఆయన అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. తాజాగా అలాంటి మరో నిర్ణయం తెరపైకి రావడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్టు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు.
తన నామినే షన్‌ను ఉపసంహిరించుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఇదిలా వుండగా ఇవాళ ఉదయం ఆయన తన మ్యానిఫెస్టోను కూడా ప్రకటించి, ఆ తర్వాత కొద్ది సేపటికే పోటీ నుంచి విరమించుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
సీవీఎల్ మద్దతుపై స్పష్టత రాలేదు. పోటీ నుంచి తప్పుకోడానికి గల కారణాలను రెండు రోజుల్లో మీడియాకు వివరిస్తానని ఆయన ప్రకటించారు. ‘మా’ ఎన్నికల బరిలో చివరికి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు మాత్రమే మిగిలాయి. ఈ దఫా ‘మా’ ఎన్నికలు టాలీవుడ్‌లో స్పష్టమైన చీలిక తీసుకొచ్చాయని చెప్పొచ్చు.