జనసేనాని పవన్‌కల్యాణ్‌లో కాపు బయటికొచ్చింది. తాను కులాలు, మతాలకు వ్యతిరేకమంటూనే …కులరాజకీయాలకు పవన్ పక్కాగా తెరలేపారు. దీనికి రాజమహేంద్రవరం కేంద్రమైంది.
రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలతో కలిసి శనివారం ఆయన శ్రమదానం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆవేశపూరిత ప్రసంగంతో జనసైనికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా కులాల గురించి మాట్లాడ్డం తనకు ఇష్టం లేదంటూనే , మనసులో మాటను బయట పెట్టారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజంతా ఐక్యం కావాలని పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు.
కాపుల్లోని ఒక తెగకు కష్టమొస్తే మరొకరు అండగా నిల వాలని ఆయన కోరారు. కాపుల్లోని అన్ని తెగలు ముందుకొస్తేనే సమాజంలో మార్పు సాధ్యమని తేల్చి చెప్పారు. సమాజంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో మార్పు అనేది గోదావరి జిల్లాలపై ఆధారపడి ఉందన్నారు. దీనికి కారణం ఆయా జిల్లాలో అత్యధిక సంఖ్యలో కాపులుండడమే అని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు. కోపాన్ని దాచుకునే కళ అందరూ నేర్చుకోవాలని కోరారు.
రాయలసీమలో కోపాన్ని మూడు తరాలు దాచుకుంటారని గుర్తు చేశారు. కానీ ఇక్కడి వాళ్లలో అలా ఉండదన్నారు. కోపం వెంటనే తగ్గిపోతుందన్నారు. అలా ఉంటే ఎలా అని ఆయన నిలదీశారు. మన కోపంతో అన్యాయం చేసేవాడికి వెన్నులో వణుకు పుట్టించాలని పవన్ హెచ్చరించడం గమనార్హం.
రాజకీయంగా రాణించాలంటే తాను కాపు అని బలమైన సంకేతాన్ని పంపాలని పవన్ నిర్ణయించుకున్నట్టు…ఈ సభ ద్వారా తేలిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాను కాపు కాదని చెప్పుకోవడం ద్వారా, తన కులం ఓన్ చేసుకోలేదనే ఆందోళన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. బీసీల తర్వాత కాపులే అత్యధిక సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. అందుకే పవన్ ఇవాళ్టి సభలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనే పిలుపు ఇవ్వడం.