కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు సైరన్ మోగింది. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ప్రధాన పాలక ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి.
వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ, టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ బరిలో నిలిచారు. అయితే బద్వేలు ఉప పోరులో పోటీ చేసేందుకు టీడీపీ అయిష్టంగా ఉన్నట్టు సమాచారం. ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఏకగ్రీవంగా ఇచ్చే సంప్రదాయం గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో వస్తోంది. ఈ సంప్రదాయం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మొదలైన విషయం తెలిసిందే.
అయితే నంద్యాల ఉప ఎన్నికలో ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో నంద్యాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే తమ పార్టీ తరపున గెలుపొంది,
టీడీపీలోకి వెళ్లారని, అందువల్ల పోటీ పెడతామని వైసీపీ చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే నంద్యాల వైసీపీ పోటీ నిలిపింది. ఆ తర్వాత తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబానికి కాకుండా, డాక్టర్ గురుమూర్తికి వైసీపీ టికెట్ ఇచ్చింది. దీంతో అక్కడ ఇతర పార్టీలు కూడా పోటీలో నిలిచాయి.
ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నిక వచ్చింది. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ వైసీపీ తరపున బరిలో నిలిచారు. తమకు ఏకగ్రీవంగా ఇవ్వాలని వైసీపీ తరపున ఎవరైనా ప్రతినిధులు వచ్చి అడిగితే, అంగీకరించేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా ఎన్నికల ఖర్చుతో పాటు ఎటూ గెలవలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో… ఉప ఎన్నికపై టీడీపీ నేతలు, శ్రేణులు నిరాసక్తతో ఉన్నట్టు సమాచారం.
కానీ ఏకగ్రీవం కోసం ప్రతిపక్ష పార్టీలను అడగడం కంటే పోటీకే అధికార పక్షం వైసీపీ ఉత్సాహం చూపుతుండడం విశేషం. దీంతో టీడీపీ తీవ్ర నిరాశనకు లోనవుతోంది. ఉప ఎన్నికలో ఎలాగైనా రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని, అదంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులే భరించాల్సి రావడంతో పోటీకి వెనుకాడుతున్న దుస్థితి.
ఈ విషయమై చంద్రబాబు దృష్టికి కూడా టీడీపీ నేతలు తీసుకెళ్లారు. అయితే అధికార పార్టీ నుంచి ఏకగ్రీవమై ప్రతిపాదన వస్తే… ఆలోచిద్దామని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలు కావడంతో టీడీపీ ఆశిస్తున్న విధంగా జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.