పవన్ కోసం నాన్నగారు 11న ప్రెస్ మీట్ పెడతారు

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, పవన్ కల్యాణ్ సృష్టించిన అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ మంత్రులు ఇవాళ్టికీ పవన్ పై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పట్లో ఇది చల్లారేలా కనిపించడం…

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, పవన్ కల్యాణ్ సృష్టించిన అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ మంత్రులు ఇవాళ్టికీ పవన్ పై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పట్లో ఇది చల్లారేలా కనిపించడం లేదు కూడా. ఇదిలా ఉండగా.. ఈ ఎపిసోడ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు.

తన ప్రసంగంలో పవన్ కల్యాణ్, మోహన్ బాబుపై కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మోహన్ బాబు కూడా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత సవివరంగా స్పందిస్తానని తెలిపారు. ఇదే విషయాన్ని మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు నిర్థారించారు. 11వ తేదీన నాన్నగారు ప్రెస్ మీట్ కోసం రెడీ అవుతున్నారని, గట్టిగా ప్రిపేర్ అవుతున్నారని కూడా స్పష్టంచేశాడు

“పవన్ కల్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు నాన్నగారు తప్పకుండా సమాధానం చెబుతారు. 11వ తేదీన ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఒకవేళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదల ఆలస్యమైతే, 12వ తేదీన ప్రెస్ మీట్ పెడతారు. మీడియా సమావేశం పెట్టడం మాత్రం పక్కా. దీనికి సంబంధించి ఇప్పటికే నాన్నగారు ప్రిపేర్ అవుతున్నారు. కొంత సమాచారం తెప్పించుకున్నారు. పక్కా ఆధారాలతో ఆయన మీడియా ముందుకొస్తారు.”

ఇలా పవన్ కల్యాణ్ కు సమాధానం చెప్పడం కోసం మోహన్ బాబు గట్టిగా ప్రిపేర్ అవుతున్న విషయాన్ని బయటపెట్టాడు మంచు విష్ణు. అంటే.. పవన్ సృష్టించిన అలజడి మరో 10 రోజుల పాటు కొనసాగనుందన్నమాట.

“మా” ఎన్నికలు.. మరో వికెట్ డౌన్

మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ.. అభ్యర్థులపై క్లారిటీ వస్తోంది. ఇప్పటికే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు బండ్ల గణేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ లిస్ట్ లోకి సీనియర్ నటుడు, న్యాయవాది సీవీఎల్ నరసింహారావు కూడా చేరారు. 

అసోసియేషన్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు సీవీఎల్ ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్ష పదవి కోసం వేసిన నామినేషన్ ను ఆయన ఉపసంహరించుకున్నారు. తను ఎందుకు తప్పుకున్నాననే విషయంపై 2 రోజుల్లో వివరణ ఇస్తానని, ఏ ప్యానెల్ కు తన మద్దతు ఉండదని సీవీఎల్ అంటున్నారు.

తాజా పరిణామంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వార్ మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ మధ్య లాక్ అయింది. వీళ్లలో ఎవరు గెలుస్తారనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. ఇప్పటికే రెండు ప్యానెళ్లు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓవైపు ప్రచారం చేస్తూనే, మరోవైపు సవాళ్లు-ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. మొన్న మంచు విష్ణు చేసిన విమర్శలను నిన్న ప్రకాష్ గట్టిగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే.