ప్రచారం ఎలా పొందాలనే అంశంపై టీడీపీ ఉచిత శిక్షణ ఇస్తోంది. నేడు అత్యవసరంగా నిర్వహించే పొలిట్‌బ్యూరో, రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాలు ఇందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన టీడీపీ …అత్యవసర సమావేశం పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. టీడీపీకి ఎన్నికల ఫోబియో పట్టుకుంది.
ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు ….ఇక ఈ ప్రచారాలతో ఎలాంటి రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ నేతలు భావిస్తున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిషత్ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ అంశంపై విస్తృతమైన ప్రచారం పొందాలనే యావ తప్ప, ఎన్నికల్లో పాల్గొని ప్రజాభిమా నం చూరగొనాలనే తపన టీడీపీలో కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని ముందుగానే నిర్ణయించుకుని, అత్యవసర సమావేశం పేరుతో తమ అనుబంధ చానళ్లలో లైవ్ కవరేజ్ ఇస్తూ, డిబేట్‌లు నిర్వహిస్తూ హంగామా చేయాలనే ఎత్తుగడలో భాగమే ఈ తంతు అని అంటున్నారు
సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్, హీరోహిరోయిన్లతో విస్తృతమైన ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ …ప్రేక్షకులను ఆకట్టు కోవడం చూశాం, చూస్తున్నాం. కానీ టీడీపీ వైఖరి చూస్తుంటే సినిమా ఇండస్ట్రీని మించిపోయేలా డ్రామాకు తెరలేపుతున్నారనే విమర్శలొస్తున్నాయి.
గత ఏడాది మార్చిలో జరిగిన ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నందు వల్ల వాటిని రద్దు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చి …పరాజయం నుంచి తప్పించుకోవాలని టీడీపీ దారులు వెతుక్కుంటోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ పదవీ విరమణతో ఇక తమకు రాజకీయ భవిష్యత్ లేదనట్టు టీడీపీ వ్యవహార శైలి ఉంది.
ఒక అధికారిని నమ్ముకుని రాజకీయాలు చేయడం ఏంటో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. గత ఎస్ఈసీ నిమ్మగడ్డ నేతృత్వంలో ఎలాంటి ఫలితాలు టీడీపీకి వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయనే భయంతో టీడీపీ ఎన్నికలంటే భయంతో పరుగులు పెడుతోంది. కానీ విడుదల కాని సినిమాకు ఉచిత ప్రచారం హోరెత్తించినట్టు… నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం నిర్వహిస్తోందన్న విమర్శలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.