తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేసే ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ వ్యవహారం మరింత ఇరకాటంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేసును విచారిస్తున్న న్యాయస్థానం ఎదుట నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి ఓటేయాలని చంద్రబాబు నాయుడు తనను కోరారని, అంతేగాక ఆ విషయంలో తన వాళ్లు ఇచ్చే హామీలన్నింటినీ తను నెరవేరుస్తానంటూ చంద్రబాబు నాయుడు తనకు చెప్పారంటూ స్టీఫెన్ సన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు తనతో మాట్లాడిన అనంతరం తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ విభాగానికి చెందిన సెబాస్టియన్ తనను కలిశారని, చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చారని స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.
ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని ఆఫర్ చేశారని, అందులో 50 లక్షల మొత్తంతో రేవంత్ తన వద్దకు వచ్చినట్టుగా, ఆ సమయానికే తను ఏసీబీకి సమాచారం ఇచ్చి.. పట్టిచ్చినట్టుగా స్టీఫెన్ సన్ కోర్టుకు వివరించారని తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో ఆది నుంచి చంద్రబాబు నాయుడి ఆడియో టేపులు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఆడియో టేపులు తనవి కావని ఎప్పుడూ చెప్పని చంద్రబాబు నాయుడు, తన ఫోన్ ను ఎలా ట్యాప్ చేస్తారంటూ అడ్డగోలుగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ ఆడియో రికార్డును చేయడానికి చంద్రబాబు ఫోన్ నే ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు.
చంద్రబాబుతో మాట్లాడిన స్టీఫెన్ సన్ కూడా ఆ కాల్ ను రికార్డు చేసి ఉండొచ్చు. ఈ వ్యవహారం లోతు ఎంతో తెలిసే చంద్రబాబు నాయుడు ఠారెత్తిపోయారు. అప్పట్లోనే హైదరాబాద్ ను ఖాళీ చేసి, తెలంగాణలో తన పార్టీని తాకట్టు పెట్టేశారు. అయినప్పటికీ ఆ రచ్చ ఆయనను వదిలేలా లేదు.
ఇప్పుడు స్వయంగా స్టీఫెన్ సన్ కూడా తన వాంగ్మూలంలో చంద్రబాబు నాయుడు తనతో మాట్లాడిన వైనాన్ని వివరించడంతో చంద్రబాబుకు ఉచ్చు బిగుస్తున్నట్టే అని స్పష్టం అవుతోంది.