స్థానిక సంస్థల ఎన్నికల్లో చివరి ఘట్టమైన పరిషత్ ఎన్నికలు ఇంకా మిగిలే ఉన్నాయి. గత ఏడాది మార్చిలో కోవిడ్ కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు తిరిగి నిర్వహించే విషయమై నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, జగన్ సర్కార్ మధ్య ఓ మినీ యుద్ధమే జరిగింది.
ఎట్టకేలకు న్యాయస్థానాల జోక్యంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ శ్రీకారం చుట్టారు. అయితే తనకు న్యాయస్థానాలు ఇచ్చిన సంపూర్ణ అధికారాలు, స్వేచ్ఛను ఉపయోగించుకుని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో సమగ్రతను నిమ్మగడ్డ సాధించలేకపోయారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండానే ఆయన పదవీ విరమణ చేశారు. ఇదిలా ఉండగా నూతన ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను నీలం సాహ్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
పరిషత్ ఎన్నికల బహిష్కరణకు ప్రధానంగా టీడీపీ అభిప్రాయాలుగా తెరపైకి వస్తున్న కారణాల గురించి తెలుసుకుందాం. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హయాంలోనే రెచ్చిపోయిన అధికార పార్టీ.. ఇప్పుడు నీలం సాహ్ని నేతృత్వంలో పూర్తి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తుంది.
కోరి మరీ నియమించుకున్న నీలం సాహ్ని నేతృత్వంలో అధికార పార్టీ మరిన్ని అరాచకాలకు పాల్పడుతుందని టీడీపీ భయపడుతోంది. అధికార పార్టీ అరాచకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ మాత్రం అడ్డుకట్ట వేయలేదని, అలాంటప్పుడు పోటీలో పాల్గొనడం కంటే, బహిష్కరించి లోకానికి జగన్ ప్రభుత్వ నియంతృత్వం గురించి చాటి చెప్పడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
అయితే టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయమే తీసుకుంటే ….అది ఏపీ చరిత్రలో ఆ పార్టీకి మాయని మచ్చగా మిగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడి జీవితంలోనైనా, రాజకీయాల్లోనైనా సవాళ్లు ఎదురవుతూ ఉంటాయని, వాటిని ఎదుర్కొని నిలబడాలే తప్ప పారిపోవడం పరిష్కారం కాదని రాజకీయ, మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.
పరిషత్ ఎన్నికలను బహిష్కరించడమంటే …ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవడమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు లాంటి నిషేధిత సంస్థలు మాత్రమే ప్రజాస్వామ్యంపై లేకపోవడంతో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తుంటాయనే విషయాన్ని ప్రజాస్వామికవాదులు గుర్తు చేస్తున్నారు.
మనిషి దేనినైనా కోల్పోవచ్చు గానీ, ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఎప్పటికీ తన నుంచి దూరం కాకుండా కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిషత్ ఎన్నికల బహిష్కరణపై టీడీపీ అంతరంగం చూస్తుంటే… ఆ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నట్టు కనిపిస్తోందని చెబుతున్నారు.
ఇది ఒక రాజకీయ పార్టీగా టీడీపీకి ఎంత మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. రాజకీయాలన్న తర్వాత గెలుపోటములు సహజమని, అంతమాత్రాన భవిష్యత్‌పై నమ్మకాన్ని కోల్పోతే పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. నిజంగా టీడీపీ ఆరోపిస్తున్నట్టు జగన్ ప్రభుత్వం అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే … ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాటిపై పోరాడాల్సిన బాధ్యత టీడీపీపై ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.
అందుకు విరుద్ధంగా కాడి పడేసి ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం ద్వారా, అధికార పార్టీ ఆగడాలకు పరోక్షంగా ప్రధాన ప్రతిపక్షం సహకారం అందించినట్టు కాదా? అని పబ్లిక్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. బహుశా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం టీడీపీలో ఒక రకమైన వైరాగ్యం, పలాయన వాదాన్ని పెంపొందిస్తోందనే ఆందోళన ఆ పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషుల్లో వ్యక్తమవుతోంది.