పరిషత్ ఎన్నికలను బహిష్కరించే దిశగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అడుగులు వేస్తోందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకవేళ టీడీపీ నిర్ణయం బహిష్కరణే అయితే మాత్రం … భవిష్యత్‌లో ఆ పార్టీ చాలా పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో సరిదిద్దుకోలేని తప్పిదం చేసినట్టే అని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రెండో స్థానాన్ని ఆక్రమించుకోడానికి జనసేన -బీజేపీ కూటమి ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తోంది. ఒకవేళ టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తే మాత్రం …బీజేపీ-జనసేన కూటమి నెత్తిన పాలు పోసినట్టే అని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే …ఓ రాజకీయ శూన్యతను ఆక్రమించే అవకాశం బీజేపీ- జనసేన కూటమికి టీడీపీనే చేజేతులా పూలల్లో పెట్టిచ్చినట్టే అని చెబుతున్నారు.
ఎలాంటి రాజకీయ పోరాటాలు, శ్రమ లేకుండానే బీజేపీ -జనసేన కూటమికి ప్రత్యామ్నాయ అవకాశాన్ని టీడీపీనే అందించినట్టు అవుతుంది. రాజకీయాల్లో ఎత్తుగడలు, వ్యూహాలు ఉంటాయి. అయితే ఎన్నికల బహిష్కరణ నిర్ణయం మాత్రం రాజకీయ పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల్లో భాగమైన సందర్భం ఎక్కడా ఉండదు. అలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు వేరే వ్యవస్థలున్నాయి. అలాంటి వ్యవస్థలకు ఒక్క ప్రజాస్వామ్యంపైనే కాదు, న్యాయ వ్యవస్థపై కూడా నమ్మకం ఉండదు.
నాలుగు దశాబ్దాల వార్షికోత్సవాన్ని జరుపుకున్న పార్టీ అడుగులు … ఇంత కాలం తర్వాత తడబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ అడుగులు తడబడొచ్చేమో కానీ, తప్పటడుగులు ఎంత మాత్రం వేయకూడదు. అలా వేస్తే ….దాన్ని అవకాశంగా తీసు కుని మరో పార్టీనో, కూటమో దూసుకొస్తుంది.
రాజకీయాల్లోనైనా, జీవితంలోనైనా ఫైటర్‌కు మాత్రమే భవిష్యత్ ఉంటుంది. చావోరేవో అని పోరాడాల్సిన సమయంలో …తనకు తానుగా ఆత్మార్పణం చేసుకుంటూ, మరో ప్రతిపక్ష కూటమికి ప్రాణం పోయడం టీడీపీ చేస్తున్న అతి పెద్ద తప్పుగా చెప్పక తప్పదు.
టీడీపీ తాజా వ్యూహాలు ఆ పార్టీ శ్రేణులకు తీవ్ర నిరుత్సాహం కలిగిస్తుండగా, బీజేపీ -జనసేన కూటమి శ్రేణులు మాత్రం ఇది తమకు ఆయాచిత వరంగా భావిస్తున్నాయి. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలుండవని తరచూ చెబుతుంటారు. బహుశా టీడీపీ పరిస్థితికి ఈ నానుడికి అద్దం పడుతున్నట్టే కనిపిస్తోంది.