వకీల్ సాబ్ సినిమా మీద సంగీత దర్శకుడు థమన్ వున్నంత ఆసక్తిగా మరెవ్వరూ లేరనే చెప్పాలి. అలవైకుంఠపురములో తరువాత థమన్ బాగా ఆసక్తిగా ప్రమోట్ చేస్తున్న సినిమా వకీల్ సాబ్.
ఈ సినిమా పాటల గురించి థమన్ ఓ ముచ్చట చెప్పారు. అసలు ఈ సినిమా చేయాలి అన్నపుడు పింక్ సినిమా గురించి తెలుసు కనుక, పాటలు ఎలాగూ వుండవు, మహా వుంటే ఓ మాంటేజ్ సాంగ్ వుంటుంది. ఆర్ఆర్ మీదే గట్టిగా కృషి చేయాలి అని అనుకున్నారట.
కానీ తీరా దర్శకుడు స్క్రిప్ట్ నెరేట్ చేసిన తరువాత పాటలకు స్కోప్ వుందని అర్థమైందట. ఫ్లాష్ కట్ లో వచ్చే పవన్-శృతి ల మీద పాట కోసం సామజవరగమన టైపు సాంగ్ ట్యూన్ చేసాడట థమన్.
పాట ట్యూన్, పాడేవాళ్ల సెలక్షన్, అంతా ఓకె అయిపోయిందట. కానీ పవన్ మీద ఆ పాట ఎలా వుంటుంది? అన్న అనుమానం వచ్చి, దాన్ని పక్కన పెట్టి, మరోపాట చేసి ఓకె చేయించుకున్నాడట. అదే 'కంటి పాట, కంటిపాప' అనే సాంగ్ అయిందట.