ఈసారి టీడీపీ గెలవాలంటే, లోకేష్ పక్కకు తప్పుకోవాల్సిందే.. ఇదేదో కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు చేసిన డిమాండ్ కాదు, స్వయానా చంద్రబాబు రాసుకున్న షెడ్యూల్. అవును, లోకేష్ లేకుండానే ఆయన ఏడాదిపాటు జిల్లాల పర్యటనకు షెడ్యూల్ రెడీ చేశారు. చినబాబుకి అందులో స్థానం లేకుండా చేశారు.
లోకేష్ బస్సు యాత్ర చేస్తారా, సైకిల్ యాత్ర చేస్తారా, పాదయాత్ర చేస్తారా అని అలోచించుకోడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టి చంద్రబాబు యాత్ర మొదలు పెట్టారు. లోకేష్ ని తనతోకూడా తీసుకెళ్తే తన పర్యటనలు కూడా అభాసుపాలవుతాయనే ఉద్దేశంతో తెలివిగా పుత్రరత్నాన్ని పక్కనపెట్టారు చంద్రబాబు.
ఓవైపు వైసీపీ 175 స్థానాల టార్గెట్ పెట్టుకుంది. దానికి అనుగుణంగానే ఆ పార్టీ నేతలు గడప గడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తున్నారు. బస్సు యాత్రలు కూడా చేసి వచ్చారు. ఈ దశలో టీడీపీ కేవలం మహానాడుతో సంతృప్తి పడితే సరిపోదు. నాయకులు ప్రతి ఊరికీ వెళ్లాలి, ప్రతి గడపా తొక్కాలి. అందుకే చంద్రబాబు యాత్ర మొదలు పెట్టారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు.
ప్రతి నెలా రెండు జిల్లాల్లో తిరుగుతారు. ఒక్కో జిల్లాలో మూడు రోజులపాటు మకాం వేస్తారు. ఇలా ఈనెల 15 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనలు మొదలు కాబోతున్నాయి. చోడవరం, అనకాపల్లి, చీపురుపల్లి సెగ్మెంట్లలో ముందుగా ఆయన పర్యటించబోతున్నారు. బహిరంగ సభ, కార్యకర్తలు, నాయకులతో సమావేశం, రోడ్ షో.. ఇలా మూడు రోజులు మూడు ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఇలా ఈ ఏడాదిలో 80 నియోజకవర్గాలు కవర్ చేయాలనేది చంద్రబాబు ఆలోచన.
ఆలోచన బాగుంది కానీ, అందులో చినబాబుకి చోటు లేకపోవడమే ఇప్పుడు విచిత్రంగా ఉంది. భావి నాయకుడికి చోటు లేకుండా చంద్రబాబు ఒక్కరే పర్యటనలు చేస్తున్నారంటే ఆయన దృష్టిలో చినబాబు స్థానం ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు.
ఇన్నాళ్లూ కొడుకు భవిష్యత్తు కోసం వాస్తవాలు గ్రహించకుండా పనిచేశారు బాబు. కానీ ఇప్పుడు అదే కొడుకు భవిష్యత్తు కోసం వాస్తవం గ్రహించారు, కొడుకునే పక్కనపెట్టారు. ముందు పార్టీని గెలిపించుకుంటే ఆ తర్వాత కొడుకుని రాజుని చేసుకోవచ్చనేది బాబు ఆలోచన. అందుకే లోకేష్ కి ఎలివేషన్లు లేకపోయినా పర్లేదు, పార్టీ గెలవాలంటూ పట్టుబట్టారు. పర్యటనలు మొదలు పెట్టారు. లోకేష్ ని బ్యాక్ బెంచ్ కి నెట్టేశారు.