విశాఖ ఎంపీ సీటు విషయంలో వైసీపీ బిగ్ ట్విస్ట్ ఇస్తోంది. విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చే విధంగా వైసీపీ డెసిషన్ ఉంటుందని అంటున్నారు. విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్లేస్‌లో బీసీ కార్డు తో వైసీపీ ముందుకు రాబోతోంది.
విశాఖ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ని ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. విశాఖ పార్లమెంట్ పరిధిలో బీసీలు నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నారు. బీసీలు విశాఖ నుంచి ఎంపీ అయిన హిస్టరీ అయితే లేదు.
చాలాకాలంగా చూస్తే ఓసీలే విశాఖ నుంచి ఎంపీలుగా ఉంటున్నారు. దాంతో దాన్ని బ్రేక్ చేస్తూ విశాఖ వంటి కీలకమైన ఎంపీ స్థానంలో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాల వ్యూహానికి గట్టి దెబ్బ తీయాలన్నది వైసీపీ ఆలోచనగా ఉంది.
విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. విశాఖ తూర్పు లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత వెలగపూడి రామక్రిష్ణబాబుకు ప్రత్యర్ధిగా ఎంవీవీని నిలబెట్టి ఆ సీటుని కైవశం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది.
విశాఖ నుంచి వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి ఓసీ అభ్యర్ధులే పోటీ పడతారు అని ప్రచారంలో ఉన్న నేపధ్యంలో బీసీ అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది అంటూ వస్తున్న వార్తలు నిజమైతే విశాఖలో రసవత్తరమైన పోరు సాగడం ఖాయమని అంటున్నారు.