గట్టి చేరికలు లేకపోతే తుస్సుమన్నట్టే!

ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పార్టీ తరఫున రాజకీయ సభ పెట్టడానికి ఒక ముహూర్తం ఖరారైంది. గతంలో రెండు మూడుసార్లు తెలంగాణలో సభ ప్లాన్ చేసుకుని చివరి నిమిషంలో రద్దు చేసుకున్న…

ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పార్టీ తరఫున రాజకీయ సభ పెట్టడానికి ఒక ముహూర్తం ఖరారైంది. గతంలో రెండు మూడుసార్లు తెలంగాణలో సభ ప్లాన్ చేసుకుని చివరి నిమిషంలో రద్దు చేసుకున్న అమిత్ షా.. మరో ముహూర్తంతో ముందుకు వస్తున్నారు. 

వయా హైదరాబాదు ఖమ్మం వెళ్లేలా రూట్ మ్యాప్ లు వేసినప్పుడు అవాంతరాలు వచ్చాయని సెంటిమెంటు ఫీలయ్యారేమో గానీ.. ఈసారి గన్నవరం విమానాశ్రయం మీదుగా ఖమ్మం చేరబోతున్నారు. ఈనెల 27న ఖమ్మంలో అమిత్ షా హాజరయ్యే బహిరంగసభను అతిపెద్ద స్థాయిలో నిర్వహించాలని తెలంగాణ కమలదళం ఉవ్విళ్లూరుతోంది.

అమిత్ షా ఖమ్మం సభ 27న జరగనుంది. ఎటూ ఎక్కడ సభ పెట్టినా సరే.. అక్కడి భాజపాయేతర పార్టీలను, కాంగ్రెసును తిట్టడం అలవాటుగా మార్చుకున్న అమిత్ షా.. ఖమ్మం సభ నుంచి కొత్త విషయాలు ఏమైనా చెప్తారని ఆశించడం దండగ. పైగా తెలంగాణ ప్రజలకు ఆయన ఏమైనా వరాలు ప్రకటిస్తారని అనుకోవడం కూడా భ్రమ. కేసీఆర్ ది కుటుంబపాలన అని, కేసీఆర్ సర్కారు వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నదని అనడం మినహా.. మరో ప్రత్యేకఅంశం ఈ సభలో ఉండకపోవచ్చు.

ఖమ్మంలోనే భారాస ఆవిర్భావ సభ, కాంగ్రెస్ ప్రజాగర్జన సభ జరిగిన తర్వాత బిజెపి పెడుతున్న సభను సక్సెస్ చేయడం వారికి కత్తిమీద సాము. ఆ రెండు పార్టీల సభలు ఘనంగా జరిగాయి. లక్షల్లోజనాన్ని పోగేశారు. వారికి స్థానిక నాయకత్వం మద్దతు కూడా ఉంది. అయితే భాజపాకు స్థానిక నాయకత్వం అంత బలమైనది కాదు. ఈ నేపథ్యంలో అమిత్ షా సభకు ఆ రెండు పార్టీల కంటె ఎక్కువ జనం రాకపోతే.. పరువు పోతుంది. ఈ సభ విషయంలో పరువు కాపాడుకోవాలంటే అదొక్కటే కాదు.. మరో అంశంమీద కూడా స్థానిక నాయకులు దృష్టి సారించాలి.

భారాస జాబితా కూడా ప్రకటించేసిన తర్వాత.. ఎన్నికలు ముంచుకువచ్చేసినట్టే. భారాస అసంతృప్తులు కాంగ్రెస్ బాట పట్టిపోతున్నారు. భారాసలోను, కాంగ్రెస్ లోను చేరికల హడావుడి కనిపిస్తోంది. ఆ విషయంలో భాజాపనే స్తబ్దంగా ఉంది.

అమిత్ షా సభ జరిగే నాటికి, అంటే మరో మూడు రోజుల్లో పార్టీలో చేరడానికి ఇతర పార్టీల నుంచి గట్టి నాయకులను వేటాడి పట్టుకోవాలని.. కమల నాయకులు శతథా ప్రయత్నిస్తున్నారు. కానీ.. అసలు ఆ పార్టీతో టచ్ లో ఉన్నవారైనా ఎవరూ కనిపించడం లేదు. పరువు కాపాడుకోవాలంటే,.. పార్టీ బలపడుతున్నదని ప్రజలను నమ్మించాలంటే.. చేరికలు ఉండి తీరాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.