మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వస్తోంది గాండీవధారి అర్జున. ఈ సినిమా చాలామందికి కీలకం. మరీ ముఖ్యంగా హీరో వరుణ్ తేజ్ కు అత్యంత కీలకం. ఈ ఏడాది అతడు ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. 2023లో తొలి సినిమా ఇదే. అంతేకాదు, ఈ సినిమాతో అతడు తననుతాను నిరూపించుకునే స్థితిలో పడ్డాడు.
గతేడాది సమ్మర్ లో గని సినిమా వచ్చింది. వరుణ్ తేజ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా ఫలితానికి బిత్తరపోయిన వరుణ్ తేజ్, ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ కూడా విడుదల చేశాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న సోలో రిలీజ్ ఇదే.
అయితే వరుణ్ తేజ్ కెరీర్ లో రీసెంట్ మూవీ మాత్రం 'గని' కాదు. గతేడాది అతడి నుంచి ఎఫ్3 మూవీ వచ్చింది. ఎఫ్-2 అంత కాకపోయినా, ఓ మోస్తరుగా ఆడింది ఆ మూవీ. కానీ ఆ సక్సెస్ ను వరుణ్ తేజ్ సోలోగా తన ఖాతాలో వేసుకోలేడు. ఎందుకంటే, ఆ సినిమాలో వెంకటేష్ కూడా ఓ హీరో.
సో.. వరుణ్ తేజ్ నుంచి గని తర్వాత సోలోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున మాత్రమే. ఈ సినిమా సక్సెస్ పైనే అతడి మార్కెట్ ఆధారపడి ఉంది. ఇక వరుణ్ తేజ్ తో పాటు మరింత మంది కెరీర్స్ కు ఈ సినిమా కీలకంగా మారింది.
ఏజెంట్ తో డిజాస్టర్ అందుకున్న హీరోయిన్ సాక్షి వైద్యకు, ది ఘోస్ట్ తో అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు గాండీవధారి అర్జున సినిమా రిజల్ట్ చాలా కీలకం కానుంది.