సీబీఐ, ఈడీలు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిని కటకటాల వెనక్కి పంపుతున్న సంగతి తెలిసిందే. అధికారం దక్కిన తొలి ఐదేళ్లలో మోడీ సర్కారు కాంగ్రెస్ నేతల విషయంలో ఆచితూచి వ్యవహరించింది. కాంగ్రెస్ వాళ్లను భ్రష్టాచారులు అంటూ ధ్వజమెత్తిన మోడీ వారిని అరెస్టులు మాత్రం చేయించలేదు. వారిపై బోలెడన్ని అవినీతి ఆరోపణలు చేసినా మోడీ వారి అరెస్టులకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా లేరు.
అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాకా తీరుమారింది. అది కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో.. బీజేపీ వాళ్లు తీరు మార్చుకున్నారు. దూకుడు పెరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ తరహాలో మారుతోంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులను లొసుగులను అడ్డం పెట్టుకుని కటకటాల వెనక్కుపంపే ప్రక్రియ ఊపందుకుంది.
వారు నేరాలే చేసి ఉండొచ్చు.. అయితే ఐదేళ్లుగా లేని అరెస్టులు ఇప్పుడు ఎందుకనేది ప్రశ్న! ఇప్పటికే చిదంబరం, డీకే శివకుమారలు జైలు పాలయ్యారు. వారు కేరాఫ్ తీహార్ గా ఉన్నారు. ఈ పరంపరలో తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ లకు ఈడీ నోటీసులు అందాయి. వారిని అరెస్టు చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. బహుశా మహారాష్ట్రలో మరోసారి బీజేపీ కూటమి నెగ్గితే అప్పుడు పవార్ లను జైల్లో పెట్టవచ్చని అంచనా.
ఇక మరో బిగ్ టార్గెట్ కు కూడా రంగం సిద్ధం అవుతోందని సమాచారం. ఆబిగ్ టార్గెట్టే రాబర్ట్ వాద్రా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి వాద్రాపై బీజేపీ రకరకాల ఆరోపణలు చేస్తూ వస్తోంది. హర్యానాలో చోటు చేసుకున్న స్కామ్ లలో వాద్రా పేరుందనేది బీజేపీ ఆరోపణ. అందుకు సంబంధించి కేసుల విచారణ కొనసాగుతూ ఉంది. ఐదేళ్లుగా వాద్రాను ముప్పుతిప్పలే పెడుతున్నారు.
ఇక త్వరలోనే అరెస్టు ముచ్చట కూడా ఉండొచ్చని సమాచారం. తనకు ఎదురుతిరిగిన ఎంతోమంది రాజకీయ నేతలను జైల్లో పెట్టించింది అనే పేరును గాంచిన సోనియాగాంధీకి అల్లుడి అరెస్టు ఇబ్బంది తప్పదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.