జనసేన భుజం మీద తెలుగుదేశం

తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకి టీజర్ అనుకోవాలో, ట్రయిలర్ అనుకోవాలో మొత్తానికి ఏదో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో జనసేన ప్రతిపాదించిన అంశాలు అయిదు. అవి ఏమిటో ఓ సారి చూద్దాం. అంతకన్నా ముందు…

తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకి టీజర్ అనుకోవాలో, ట్రయిలర్ అనుకోవాలో మొత్తానికి ఏదో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో జనసేన ప్రతిపాదించిన అంశాలు అయిదు. అవి ఏమిటో ఓ సారి చూద్దాం. అంతకన్నా ముందు ఈ జనసేన ప్రతిపాదనలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగా తను చెప్పాల్సినవి, జనసేన చేత చెప్పిస్తున్నట్లు కనిపిస్తోంది. తన మాటలు జనసేనతో పలికిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఒకటి. ఎనభయ్యవ దశకంలో గ్రామోదయ స్కీము అనేలాంటిది ఒకటి వుండేది. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిటీతో బ్యాంక్ లోన్లు ఇచ్చేవి. దాంతో యువత రకరకాల వ్యాపారాలు పెట్టుకునే అవకాశం. ఒక విధంగా మంచి సక్సెస్ స్కీమ్ ఇది. కానీ సమస్య ఏమిటంటే యువత అంతా అప్పట్లో ఫ్యాన్సీ షాపులు, సులువుగా పెట్టగలిగే వ్యాపారాలు చేసారు తప్ప, అంతకు మించి ఆలోచించలేదు. తరువాత చాలా మంది లోన్లు కట్టలేకపోవడంతో బ్యాంకులు పెద్దగా ముందుకు రావడం మానేసాయి. దాంతో ఆ స్కీము అలా మాయమైంది.

ఇప్పుడు జనసేన ప్రతిపాదించిన ఈ హామీ అలాంటిదే. కానీ మంచిదే. అందులో సందేహం లేదు. పరిశ్రమలు, అంకుర సంస్థలు స్ధాపించే యువతకు పది లక్షల వరకు సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడం అన్నది. అయితే దీనికి విధి విధానాలు ఏమిటన్నది తెలియాలి. మన పార్టీలు ముందుగా హామీలు ఇస్తాయి. అధికారంలోకి వచ్చి అమలు చేయాల్సి వచ్చినపుడు నిబంధనలు రూపొందిస్తాయి. సరే ఏ నిబంధనలు పెట్టినా కొంత మందికి అయినా అందితే మంచిదే.

ఇది తప్పిస్తే మరో కానుక ఏదీ జనసేన ప్రతిపాదించలేదు. పైగా తెలుగుదేశం ప్రతిపాదించాల్సిన అమరావతి రాజధాని అన్న పాయింట్ ను జనసేన తన పాయింట్ గా ప్రతిపాదించింది. అందువల్ల రాయలసీమ లాంటి ప్రాంతాల్లో దీనికి వ్యతిరేకత వచ్చినా అది జనసేన ఖాతాలోకి పోతుందేమో? పైగా ఈ ప్రతిపాదన పైసా ఖర్చు లేని ప్రతిపాదన.

మరోటి ఏంటయ్యా అంటే ఉచిత ఇసుకను పునరుద్దరించాలి. ఉచిత ఇసుక అన్నది పేరుకే. అప్పట్లో ఏం జరిగింది అంటే ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే, ఎంపీ కలిసి నిర్ణయించిన వారు తమ కంట్రోల్ లోకి తీసుకునే వారు. రీచ్ ల్లో మిషన్ లు పెట్టి, పోస్టర్లు వేసి మరీ దోచుకున్నారు. అంటే అదే పరిస్థితి ఇప్పుడు మళ్లీ జనసేన కోరుతోంది. నిజానికి ఇది కూడా తెలుగుదేశం మనోగతమే. దాన్నే మరోసారి జనసేన నోట చెప్పిస్తోంది.

ఇక నాలుగోది ఏమిటంటే ప్రజలపై పన్నులు, ఇతరత్రా భారాలు తగ్గించి, ఆ విధంగా సంపన్న ఆంధ్ర ప్రదేశ్ ను తయారు చేయడం. చిత్రంగా వుంది ఈ ప్రతిపాదన. రాష్ట్రం విధించే పన్నులు పెట్రోలు మీద పన్ను, రిజిస్ట్రేషన్ రేట్లు మాత్రమే. ఆ రెండూ, ప్లస్ మద్యం ఆదాయం లేకపోతే రాష్ట్రం నడవనే లేదు. ఆ సంగతి అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. కంటి తుడుపుగా తగ్గించినట్లు చూపించాలేమో కానీ ఏటేటా పెంచకుండా వెళ్లడం సాధ్యం కాదు. ఇక చెత్త పన్ను, ఇంటి పన్ను ఇలాంటివి అన్నీ స్థానిక సంస్థలు చూసుకుంటాయి.

అయిదోది స్థానికంగా ఉపాధి కల్పించి వలసలు నివారించడం. ఇదో కంటి తుడుపు ప్రతిపాదన తప్ప మరేం కాదు. వలసలు అనేది అన్ స్కిల్డ్ కార్మికల వ్యవహారం. ప్రతి ప్రాంతంలో భారీగా పరిశ్రమలు వస్తే తప్ప వలస అనేది వుంటూనే వుంటుంది. అలా అయినా కూడా భవన నిర్మాణ కార్మికల వలస అన్నది తప్పదు. ఎందుకంటే ఎక్కడ నిర్మాణాలు ఎక్కువ జరుగుతాయో అక్కడికి వలసలు వుంటాయి. అది ఇచ్ఛాపూర్వకంగా జరిగేది. కానీ జనసేన ఎందుకో అది తెలుసుకోలేక ప్రభుత్వ వైఫల్యం ఖాతాలో వేస్తూ వస్తోంది.

మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వ ఖజనా మీదా భారం పడే ప్రతిపాదన ఏదీ జనసేన చేయలేదు. ఖర్చు లేని హామీలు తప్పిస్తే జనాలు తమ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వస్తాయి అనుకునేది ఒక్కటీ లేదు.

గమ్మత్తేమిటంటే అలాంటి హామీలు అన్నీ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించడం గమనార్హం. నిరుద్యోగులకు, మహిళలకు, ఇంకా ఇంకా నగదు బదిలీలు అన్నీ తెలుగుదేశం ప్రతిపాదించింది. ఏ ఖర్చు లేనివి, తెలుగుదేశం తను చెప్పకూడదు అనుకునేవి జనసేన ఖాతాలో పడ్డాయి.