కౌలు రైతులకు సాయం.. సాధ్యమేనా?

కౌలు రైతులకు కూడా ఏటా ఇరవై వేలు సాయం చేయాలన్నది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కీలక ప్రతిపాదన. కౌలు రైతు అంటే నిర్వచనం, ఎకరాకా? అర ఎకరాకా? ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తరువాత…

కౌలు రైతులకు కూడా ఏటా ఇరవై వేలు సాయం చేయాలన్నది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కీలక ప్రతిపాదన. కౌలు రైతు అంటే నిర్వచనం, ఎకరాకా? అర ఎకరాకా? ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తరువాత బయటకు వస్తాయి. అప్పుడు కానీ ఎంత మందికి అందుతుంది అన్నది తెలియదు. 

నిజానికి ఇది కొత్తది కాదు. ఇప్పటికే అమలులో వున్నదే. కానీ ఇది అమలులో సాధ్యం కావడం లేదు. ఎందుకని? కౌలు రైతు అన్నది ఎలా తెలుస్తుంది. భూమి యజమాని ఈ మేరకు ధృవీకరించాలి. కానీ అక్కడే వస్తుంది తకరారు. నూటికి తొంభై మంది భూమి యజమానలు లిటిగేషన్లకు భయపడి ఏ ఒక్కరికీ తమ భూమి కౌలుకు ఇచ్చినట్లు అధికారికంగా ధృవీకరణ పత్రం ఇవ్వరు. అందుకే ఇప్పటికే అమలులో వున్న ఈ పథకం నీరుగారిపోయింది.

ఇప్పుడు కూడా అదే రూలు వుంటే సమస్య. లేదూ ఏ ధృవ పత్రం అవసరం లేదు అంటే పార్టీ పరంగానో, ప్రభుత్వ పరంగానో ఎంపిక చేస్తే ఇక జరిగే అవకతకవల సంగతి చెప్పనక్కరలేదు. ప్రభుత్వంలో ఏ పార్టీ వుంటే ఆ పార్టీ అనుకూలురకు అందుతుంది లేని వారికి లేదు. లేదా చేతివాటం, ముడుపులు, మామూళ్లు మామూలే.

నిజానికి కౌలు రేట్లు రాను రాను తగ్గిపోతున్నాయి. ఖర్చులకు భయపడి భూములు కౌలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఏటా ఒక్కసారి మాత్రమే వరి పండే భూములకు ఈ సమస్య ఎక్కువగా వుంది. వాణిజ్య పంటలు పండే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, మూడు పంటలు పండే గోదావరి జిల్లాల్లో పరిస్థితి వేరు. కౌలు సర్టిఫికెట్ ఇవ్వాలంటే తమకు సగం ఇవ్వాలనో, లేదా తమకు ఇచ్చే కౌలు పెంచాలనో ఇలాంటి చోట్ల కొత్త డిమాండ్లు పుట్టుకువస్తాయి. అప్పుడు ఇంక ఏం ప్రయోజనం వుంటుంది?

కౌలు రైతుల సమస్య అన్నది ఎప్పుడూ వుంటుంది. ఎందుకుంటే మనకు రైతులకన్నా కౌలు రైతులే ఎక్కువ. దీనికి పరిష్కారం మరో విధంగా ఆలోచించాలి. ప్రాక్టికల్ గా పాజిబుల్ అయ్యేలా. ఇలా అయితే కాదు.