ర్యాగింగ్ అంటే ఇదీ.. బిత్తరపోయిన లోకేష్

గతంలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులతో జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టి హడావిడి చేశారు లోకేష్. ఆ తర్వాత ప్రభుత్వం పరీక్షలకు సిద్ధమవడంతో చేసేదేం లేక సైలెంట్ అయ్యారు.…

గతంలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులతో జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టి హడావిడి చేశారు లోకేష్. ఆ తర్వాత ప్రభుత్వం పరీక్షలకు సిద్ధమవడంతో చేసేదేం లేక సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత లోకేష్ కి చేతినిండా పనిపడింది. పాస్ పర్సంటేజ్ తగ్గడంతో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. 

తప్పంతా ప్రభుత్వానిదేనంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాయి. బోధనేతర విధులు అప్పగించారంటూ, ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టారంటూ, అందుకే ఇలా ఫలితాలొచ్చాయంటూ రెచ్చిపోతున్నారు లోకేష్. తన వాదన సమర్థించుకునేందుకు తమకు అనుకూల వ్యక్తులతో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టారు. అయితే లోకేష్ షాకయ్యే విషయం. ఈ జూమ్ మీటింగ్ లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ సడన్ ఎంట్రీ ఇచ్చారు.

మామూలుగా ప్రెస్ మీట్లలో కొడాలి నాని, వంశీ.. ఇద్దరూ లోకేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంటారు. అలాంటిది నేరుగా జూమ్ మీటింగ్ లో కనెక్ట్ అయితే ఇంకేమైనా ఉందా. ప్రభుత్వంపై నిందలేస్తున్న లోకేష్ కి వాచిపోద్ది కదా. అందుకే లోకేష్ కంగారుపడిపోయారు. జూమ్ లో తనను బండబూతులు తిడతారేమోనన్న అనుమానంతో వెంటనే వారిని డిస్ కనెక్ట్ చేశారు లోకేష్. అయితే అంతలోనే ఆ జూమ్ మీటింగ్ ని కొంతమంది రికార్డ్ చేశారు, మరికొందరు స్క్రీన్ షాట్లు తీశారు. ఇప్పుడీ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ దమ్ము లేదెందుకు..?

ఏదైనా విషయంపై దమ్ముంటే బహిరంగ చర్చకు రండి, ఓపెన్ డిబేట్ కి ఇదే మా సవాల్ అంటూ రెచ్చిపోతుంటారు లోకేష్, ఇతర టీడీపీ నాయకులు. మరి జూమ్ మీటింగ్ లో నాని, వంశీ కనబడేసరికి ఎందుకంత భయపడ్డారు. నిజంగా దమ్ముంటే ఆయన జూమ్ కాన్ఫరెన్స్ లోనే ధైర్యంగా వారితో చర్చించొచ్చు కదా..? ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టొచ్చు కదా..? తన దగ్గర అంత వాక్చాతుర్యం ఉంటే.. వారితో కూడా ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పించొచ్చు కదా. 

కానీ అక్కడుంది నాని, వంశీ. ప్రభుత్వంపై కానీ, జగన్ పై లోకేష్ మాట తూలితే.. ఆ స్ట్రోక్ మామూలుగా ఉండదు. అందుకే లోకేష్ సైలెంట్ గా తప్పుకున్నారు. బతుకు జీవుడా అనుకుంటూ వారిద్దరినీ డిస్ కనెక్ట్ చేసి బయటపడ్డారు.

ఈ ఘటనతో లోకేష్ పనికిరాడని తేలిపోయింది. కడిగిపారేస్తా, ఉతికి ఆరేస్తా అంటూ కళ్లు పెద్దవి చేసి డైలాగులు కొట్టే లోకేష్.. కళ్లముందు ఇద్దరు వైసీపీ నేతలు కనిపించేసరికి తోకముడిచారు. బిక్క చూపులు చూస్తూ, బిత్తరపోతూ డిస్-కనెక్ట్ చేశారు. తనది మేకపోతు గాంభీర్యం మాత్రమే అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, తను ఎత్తుకున్న అంశంలో నిజాయితీ లేదనే విషయాన్ని కూడా లోకేష్ అంగీకరించినట్టయింది.