తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ శవాసనం వేసినప్పటికీ.. చంద్రబాబునాయుడు మాత్రం దింపుడు కళ్లం ఆశలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. నిజానికి ఇవి దింపుడు కళ్లం ఆశలు ప్రదర్శిస్తుండడమో… లేదా, తమ సరికొత్త స్నేహితుడు కాంగ్రెసు పార్టీని గెలిపించడానికి తనవంతు ప్రయత్నం చేయడమో అర్థంకావడం లేదు. మొత్తానికి కేసీఆర్ పార్టీ నెగ్గకుండా ఉంటేచాలు అనే లక్ష్యంతో… తెలుగుదేశానికి మరో ఓటమి పరాభవం చేకూర్చడానికి చంద్రబాబు సిద్ధమవుతారా? లేదా.. పార్లమెంటు ఎన్నికల్లో తమ జోడీని ఛీకొట్టి విదిలించేసుకున్న కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఎన్నికలకు ఊరేగుతారా? చూడాలి!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా సంకట స్థితిలో ఉంది. మింగమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం లాంటి సంకట స్థితి ఇది. తెలంగాణలో ప్రస్తుతం హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. తెరాస తరఫున గత ఎన్నికల్లో బరిలోకి దిగి ఓడిపోయిన సైదిరెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్ తరఫున ఈస్థానంలో గతంలో గెలిచి తర్వాత ఎంపీ అయిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీచేస్తున్నారు.
తెలంగాణలో తాము బలపడిపోతున్నట్లుగా భావిస్తున్న భాజపా కూడా ఈసారి ఇక్కడ బరిలో ఉండబోతోంది. దీనిమీద ఆ పార్టీ తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీచేసే విషయమై చంద్రబాబునాయుడు కూడా పార్టీ నేతలతో సుదీర్ఘ కసరత్తులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి తెదేపా ఇక్కడ పోటీచేసి బావుకునేదేమీ లేదు. డిపాజిట్ దక్కుతుందనే గ్యారంటీ కూడా లేదు. అలాగని, పోటీచేయకుండా ఊరుకుంటే… పరువు పోతుంది.
అసలే కుదేలైఉన్న పార్టీని అధినేత స్వయంగా గాలికొదిలేశారనే మాట వస్తుంది. అలాగని కాంగ్రెస్ కు జైకొట్టినా పరువు నష్టమే. గత శాసనభ ఎన్నికల్లో పరాభవం తర్వాత.. తెదేపాతో పొత్తువల్లనే ఓడిపోయామని ఆ పార్టీ నేతలంతా విశ్లేషిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో తెదేపా మైత్రిని తోసిరాజని సొంతంగా పోటీచేసి కొన్ని సీట్లు గెలిచారు.
ఇప్పుడు వారు దరికి రానిస్తారో లేదో తెలియదు. అలాగని.. బరిలోకి దిగితే.. తెరాస వ్యతిరేక ఓటు చీలిపోయి కాంగ్రెస్ కే చేటు జరగవచ్చు. తెరాస వ్యతిరేక ఓటు చీల్చడానికి భాజపా కూడా బరిలో ఉంది. ఇన్ని సంక్లిష్టతల మధ్య.. గెలిచే ఊసు కూడా లేని ఉపఎన్నికలో పోటీచేసి పరువుపోగొట్టుకోవాలా? పోటీచేయకుండా పరువు పోగొట్టుకోవాలా? అని చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుంది.