ఈనాడు దినపత్రిక కార్టూనిస్టు శ్రీధర్ సోదరుడు, ప్రముఖ బాలల హక్కుల ఉద్యమకారుడు అచ్యుతరావును కరోనా మహమ్మారి బలి తీసుకొంది. కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.
అచ్యుతరావుది ఉమ్మడి కుటుంబం. వామపక్ష, ప్రజాతంత్ర భావాలున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన విద్యార్థి దశలో సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ శాఖలో క్రియాశీలకంగా పనిచేశారు. అనంతరం ఆయన బాలల హక్కుల కోసం చిత్తశుద్ధితో దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడిగానే ఆయన ప్రాణాలు వదిలారు.
బాలల హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా “నేనున్నా” అంటూ వెళ్లి అక్కడ వాలేవారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడిగా కూడా ఆయన అమూల్యమైన సేవలందించారు. భార్య అనూరాధతో బాలల హక్కుల సంఘాన్ని స్థాపించి, తుది శ్వాస వరకు అదే బాటలో ప్రయాణించిన అచ్యుతరావు లేని లోటు ఎవరూ తీర్చలేరని చెప్పొచ్చు.