రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించనున్నారు. ఈ మేరకు చర్చలు కూడా పూర్తయినట్టు టాలీవుడ్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. దర్శకుడు వెంకీ కుడుముల నేతృత్వంలో కొత్త సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.
కరోనా విపత్తు రాకపోయి ఉంటే ఈ పాటికి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయి ఉండేది. కరోనా ఎఫెక్ట్‌తో ఆ సినిమా షూటింగ్ అర్ధాంతంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్త యిన తర్వాత రామ్ చరణ్ తర్వాత చిత్రం ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
కానీ యంగ్ హీరో నితిన్‌కు సూపర్‌హిట్ అందించిన ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు రామ్ చరణ్ అవకాశం ఇచ్చారని టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ‘భీష్మ’ చిత్రం కమర్షియల్‌గా కూడా మంచి హిట్ సాధించడంతో డైరెక్టర్ వెంకీకి టాలీ వుడ్‌లో డిమాండ్ పెరిగింది.
వెంకీతో తర్వాత సినిమా చేయాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారని తెలిసింది. రొమాంటిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కథా వస్తువుతో సినిమాను తెరకెక్కించాలని ఆలోచనతో వెంకీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రామ్‌చరణ్‌కు కథ వినిపించినట్టు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సినిమా చేసేందుకు అంగీకరించారని టాలీవుడ్ టాక్.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారని తెలిసింది. భవిష్యత్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదగడానికి రామ్ చరణ్ రూపంలో మంచి అవకాశం దక్కినట్టు వెంకీ భావిస్తున్నారు. చరణ్‌కు హిట్ సినిమాతో పాటు డైరెక్టర్‌గా సెలబ్రిటీ స్థాయిని అందుకోడానికి శక్తి వంచన లేకుండా శ్రమించేందుకు వెంకీ పక్కా ప్రణాళిక రచిస్తున్నారని తెలిసింది.