టైటిల్: రిపబ్లిక్
రేటింగ్: 2/5
తారాగణం: సాయి ధరం తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
కెమెరా: ఎం. సుకుమార్
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లారావు
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: దేవ కట్టా
విడుదల తేదీ: 1 అక్టోబర్ 2021
తన కొత్త సినిమా విడుదల సరిగ్గా 20 రోజులుందనగా సాయిధరం తేజ్ కి బైక్ యాక్సిడెంట్ కావడం, ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో వివాదాస్పద ప్రసంగం చేయడమనే వార్తలు మినహా ఈ “రిపబ్లిక్” కి సంబంధించిన చర్చ పెద్దగా జనాల్లో జరగలేదు. పాటలు గానీ, ట్రైలర్ గానీ ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. పైగా ఇది సీరియస్ సినిమాగా ప్రచారం జరిగింది. దాని ప్రభావం ఓపెనింగ్స్ మీద పడింది. తొలి ఆటకి ప్రేక్షకులని తక్కువగానే రప్పించినా, తర్వాతి ఆటలకైనా థియేటర్లు నింపే లక్షణాలు ఈ సందేశాత్మక చిత్రానికి ఎంతవరకు ఉన్నాయో చూద్దాం.
ఇంతకీ ఇద్దామనుకున్న సందేశమేమిటి? ఎవరికి? ప్రేక్షకులకి అర్థమయ్యిందేమిటి? తీసుకున్న సందేశమేమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుంటే చాలా వింతగా అనిపిస్తుంది.
దమ్ముంటే రమ్యకృష్ణలాగ ధనాశతోటి, దమ్ము లేకపోతే జగపతి బాబులాగ లంచగొండిగానూ ఎడ్జస్ట్ అయిపోయి బతికితే బెటర్ గానీ సాయి ధరం లాగ నీతి నిజాయితి అని బ్రతికితే చావడం ఖాయం అనిపించేట్టుగా తీసారు.
ప్రతి కథకి పొయెటిక్ జస్టిస్ అనేది ఒకటుంటుంది. వార్తలకి, చరిత్రలకి పొయెటిక్ జస్టిస్ లు ఉండవు. అందుకే కథల్లోనూ, సినిమాల్లోనూ సగటు మనిషి అది కోరుకుంటాడు. నానా కష్టాలు పడి మంచిగా బతికినవాడు సినిమాకథలో గెలవాలి. గెలవడమంటే కథాపరంగా ఉండే ఆటలోనో, కోర్టు కేసులోనో కాదు… జీవితంలో. అప్పుడే ప్రేక్షకుడికి సంతృప్తి ఉంటుంది. అప్పుడే సందేశం కూడా అందుతుంది.
ఇక్కడ లోపించింది అదే.
తన నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువశాతం మంది దేనిని ఆశించారో దానివైపే ఉన్నాను తప్ప వేరే మంచి, చెడు తాను ఆలోచించలేదని చెబుతుంది రమ్యకృష్ణ పాత్ర. అదే కదా ప్రజాస్వామ్యం అని కూడా అంటుంది. నిజమే మరి. ఏ వ్యవస్థయినా చేసేది మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రాతిపదికనే, చెయ్యాల్సింది కూడా ఇదే. కాబట్టి ఆమె పాత్రకి క్లారిటీ ఉంది.
ఎంత అధికారైనా ఏలే వాళ్లకి ఎదురురెళ్ళి కుటుంబ సభ్యుల ప్రాణాలమీదకి తెచ్చుకునే కన్నా “పెద్దలు” చెప్పినట్టు వినేస్తే బతికిపోవచ్చని చూపిస్తుంది జగపతిబాబు పాత్ర. వృత్తి ధర్మం అంటేనే పై అధికారి చెప్పినట్టు చేయడమే కదా అని కూడా అనిపిస్తుంది. కాబట్టి ఈ పాత్రకి కూడా క్లారిటీ ఉంది.
ఇక సహజంగా అబ్బిన విపరీత జ్ఞాపకశక్తితో టాప్ స్టూడెంట్ గా నిలబడి అన్ని విషయాల్లోనూ జ్ఞానం సంపాదించిన సాయిధరం తేజ్ పాత్ర వ్యవస్థని ప్రక్షాళణ చేసేయాలనుకుని ఊహించని విధంగా క్లోజ్ అవడంలోనే అయోమయం ఉంది. పాత్రకి క్లారిటీ ఉన్నా ప్రేక్షకుడికి ఆ క్లారిటీ అందదు.
అమ్ముడుపోయిన చట్టం, ప్రభుత్వానికి లొంగిపోయిన న్యాయ వ్యవస్థ, రైతుల ఇబ్బందులు, రాజకీయనాయకుల ధనదాహం, రేపులు, బూటకపు ఎన్ కౌంటర్స్ ఇలా అన్నీ టచ్ చేసి కవర్ చేయడానికి మరే సామాజిక అంశం మిగలకుండా చేసిన సినిమా ఇది.
అయినా కూడా కథ చివరికొచ్చేసరికి దర్శకుడికి మరొక పాయింట్ గుర్తొచ్చినట్టుంది..కులాల టాపిక్. అందుకే “మీవోళ్లు ఇన్నేళ్లు సంపాదించుకున్నారు. మేం కూడా సంపాదించుకోవాలి” అని ఒక వ్యక్తి అంటే, “మీవోళ్లా..!” అంటూ కంట తడి పెట్టి సాయిధరం చేసిన సెంటిమెంటల్ సన్నివేశం ఒకటుంది. అలా కులాల అంశం కవరయ్యింది.
దిశా ఎన్ కౌంటర్ అప్రజాస్వామికం అని చెబుతూ ఒకవేళ ఆ రేపిస్టుల్లో ఏ మంత్రి కొడుకో ఉంటే ఎన్ కౌంటర్ జరిగుండేదా అని ప్రశ్నిస్తాడు సాయి ధరం. ఇది అప్పట్లో చాలామంది లేవనెత్తిందే.
అందరికీ తెలిసిన, అందరూ చూసే వార్తల్ని, అభిప్రాయాల్ని తెర మీద రెండున్నర గంటల సినిమాగా చూడడానికి చాలా ఓర్పు, సహనం కావాలి. అదున్నవాళ్లు కచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. పుచ్చుకున్న సందేశాన్ని తీసుకుని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి ప్రేక్షకులది.
ఈ కథలో విలన్లుండరు. పరిస్థితులే విలన్లు. ప్రతి వాడు చెడ్డగా మారడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఓటర్ దగ్గర్నుంచి వ్యవస్థలో ఉన్న ప్రతివాడూ ఈ పరిస్థితికి కారణమంటుంది ఈ కథ. చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఫ్రస్ట్రేట్ అయ్యి, సొల్యూషన్ ఏమివ్వాలో తెలియక తీసిన సినిమాలా ఉందిది.
ఒంట్లో గాయముంది, అది నొప్పి పెడుతోంది అని అందరికీ తెలుసు. దానికి మందేంటో చెప్పి నయం చేస్తేనే కదా ఫలితం. సమస్య చెప్పి ఎవరికిస్తున్నారో తెలియని ఫలితం లేని సందేశం ఇస్తే ఉపయోగం ఏముంటుంది?
ప్రపంచ తత్వవేత్తలైన నీషే, నియంతైన హిట్లర్, కార్టూనిస్టు నుంచి పవర్ సెంటర్ గా మారిన బాల్ థాకరే..ఇలా చాలామందిని గుర్తుజేస్తూ మనోరమా ఇయర్ బుక్కులోని వార్తాంశాలన్నీ కవర్ చేసాడు దర్శకుడు.
“అజ్ఞానం గూడు కట్టుకున్న చోటే మోసం గుడ్లు పెడుతుంది..” లంటి మంచి డయలాగులైతే ఉన్నయిందులో. కానీ బరువైన పదజాలంతో ఉండే కొన్ని డయాలగ్స్ ప్రేక్షకుడికి సింక్ అయ్యే లోపు తర్వాతి సంభాషణలు దొర్లిపోతుంటాయి. దానివల్ల ఎమోషనల్ గా కట్టి పారేసే ప్రాసెస్ ని పాడుచేసుకున్నట్టయ్యింది.
సాయి ధరం నటన బాగున్నా క్యారెక్టరైజేషన్ లో గ్రిప్ లోపించింది. ఐశ్వర్య రాజేష్ ఓకే. రమ్యకృష్ణ తెరకి నిండుదనాన్ని తెచ్చింది. జగపతిబాబు అండర్ ప్లే చేసారు. ఎస్పీగా శ్రీకాంత్ అయ్యంగర్ సరిపోయాడు.
సాంకేతికంగా కూడా సినిమా పెద్ద చెప్పుకోదగ్గదిగా లేదు. మణిశర్మ సంగీతం అస్సలు క్యాచీగా లేదు.
దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్ కూడా గందరగోళంగానే ఉంది. రియలిస్టిక్ సినిమా టైపులో తెరకెక్కిస్తూ మళ్లీ కలెక్టర్ పాత్ర వేసిన హీరో చేత పిస్టల్ పట్టించి కమెర్షియల్ విన్యాసాలు చేయించాడు.
చివర్లో కోర్టు సీన్ అయితే ఒక ప్రహసనం. తనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిన న్యాయమూర్తి మీద రమ్యకృష్ణ పాత్ర “ఒరేయ్ నరసింహా” అంటూ అరుస్తూ విరుచుకుపడుతుంది. ఆ తర్వాత బీపీ వచ్చి కళ్లు తిరిగి పడిపోతుంది. అదేంటో అక్కడ అంతమందున్నా ప్రత్యర్థి అయిన సాయిధరం ఆమెను ఎత్తుకుని హాస్పిటల్ కి చేరుస్తాడు.
ఇలాంటివన్నీ రాసుకున్నప్పుడు గొప్పగా అనిపించొచ్చేమోగానీ తీసాక లెక్క మారొచ్చు. ఆ మార్పుని గమనించే జడ్జ్మెంట్ లేకపోతే సన్నివేశాలు రక్తికట్టకపోగా అభాసుపాలౌతాయి.
కరెంట్ అఫైర్స్ లో చూసిన వార్తలన్నీ తెర మీద మరొకసారి చూస్తున్నట్టు, ఒక విదేశీయుడు కుళ్లిన భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద తీసిన డాక్యుమెంటరినీ వీక్షిస్తున్నట్టు ఉంది. సందేశాత్మక చిత్రాన్ని సందేహాత్మకంగా తీసినట్టు కూడా అనిపిస్తుంది.
బాటం లైన్: సందేశాత్మక సందేహ చిత్రం