మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కి కాషాయ దళం నుంచి మద్దతు లభించింది. ఆయన ఒంటరి కాదని తమకు మంచి మిత్రుడని బీజేపీ గట్టిగానే వెనకేసుకుని వచ్చింది.
పవన్ ప్రజా సమస్యల మీద ప్రస్తావిస్తే వైసీపీ నేతలు అలా నోరు చేసుకోవడం తగునా అంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. పవన్ అడిగిన వాటికి సమాధానం చెప్పలేకనే ఇలా ఎదురు దాడి చేస్తున్నారు అంటున్నారు ఆయన.
అంతే కాదు వైసీపీ సర్కార్ సినీ పరిశ్రమను హస్తగతం చేసుకోవడానికి చూస్తోందని బాగానే బండలు వేశారు. తాను నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాను అని చెబుతున్న మాధవ్ తెలుగు సినిమా పెద్దలు ఆన్ లైన్ టికెటింగ్ కి సుముఖంగా ఉన్నామన్న మాటలను ఎందుకు వినలేదో అర్ధం కాదు మరి.
సరే మొత్తానికి పవన్ని, ఆయన మాటలను వెనకేసుకువచ్చిన మాధవ్ జనసేనతో కలసి తాము బలమైన కూటమిగా ఏపీలో ఎదుగుతామని కూడా చెప్పేసుకుంది.
ఇదిలా ఉంటే ఉక్కు ఉద్యమాన్ని కూడా ఆయన తప్పుపట్టడమే ఇక్కడ విశేషం. రాజకీయపార్టీలే తమ స్వార్ధం కోసం ఉక్కు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అంటున్నారు. ప్రైవేటీకరణ పేరిట పోరాటం అంటూ యాగీ చేస్తున్నారని ఆయన అభిప్రయాపడుతున్నారు.
ప్రైవేటీకరణ జరిగినా విశాఖ ఉక్కు కార్మికులకు ఏమీ నష్టం కలగదు అని కూడా మాధవ్ చెబుతున్నారు. మొత్తానికి పవన్ మావాడు, మంచోడు అంటూ బీజేపీ పెద్దలు ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. జనసేనతో పొత్తుపైన బీజేపీ నుంచి క్లారిటీ బాగానే ఉంది అనుకోవాలేమో.