రైతుల‌పై కోర్టు సీరియ‌స్‌

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌బాట ప‌ట్టిన రైతుల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఫైర్ అయ్యింది. న్యాయ‌స్థానంలో కేసు వేసిన త‌ర్వాత కూడా ఎందుకీ నిర‌స‌న‌లంటూ తీవ్ర‌స్వ‌రంతో సుప్రీంకోర్టు ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌కు దారి…

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌బాట ప‌ట్టిన రైతుల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఫైర్ అయ్యింది. న్యాయ‌స్థానంలో కేసు వేసిన త‌ర్వాత కూడా ఎందుకీ నిర‌స‌న‌లంటూ తీవ్ర‌స్వ‌రంతో సుప్రీంకోర్టు ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. 

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌డిబొడ్డున జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద స‌త్యాగ్ర‌హం చేసేందుకు అనుమ‌తించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో రైతు సంఘం పిటిష‌న్ వేసింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

‘మీరు మొత్తం ఢిల్లీ గొంతు నొక్కేశారు. ఇప్పుడు నగరం లోపలికి వచ్చి ఇక్కడ కూడా ఆందోళన చేయాలనుకుంటున్నారు’  అని న్యాయస్థానం మండిపడింది. అంతేకాదు, మ‌రిన్ని కామెంట్స్ చేసింది. అస‌లేం జ‌రిగిందంటే…

సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా కిసాన్ మ‌హాపంచాయ‌త్ సంఘం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంఘం ఆధ్వ‌ర్యంలో జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద స‌త్యాగ్ర‌హ్ పేరుతో శాంతియుతంగా త‌మ నిర‌స‌న చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. 

నిర‌స‌న చేప‌ట్టేందుకు ఢిల్లీ పోలీసు అధికారులు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో స‌ద‌రు రైతు సంఘం న్యాయ‌స్థానాన్ని  ఆశ్ర‌యించింది. కనీసం 200 మంది రైతులతో  నిరసన చేపట్టేందుకు స్థలం కేటాయించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని  అభ్యర్థించింది.

ఈ అభ్యర్థనపై జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  ‘మీ చుట్టూ స్థానికులున్నారు. మీ ఆందోళనలతో వారు ఆనందంగా ఉన్నారా? నగరంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇక్కడి ప్రజలకు ఉంటుంది. మీ నిరసనల్లో వారి ఆస్తులు కూడా ధ్వంసమవుతున్నాయి. హైవేలను నిర్బంధించి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని చెబుతున్నారు. రక్షణ సిబ్బందిని కూడా అడ్డుకుంటున్నారు. న్యాయ‌స్థానంలో కేసు వేసిన త‌ర్వాత ఆందోళ‌న‌లు ఏంటి? అంటే న్యాయ‌స్థాంపై కూడా పోరాడుతున్నార‌ని భావించాలా. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంచాలి’’ అని ధర్మాసనం మండిపడింది.

ఢిల్లీ శివార్ల‌లో రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు నిన్న కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందే. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించు కోవాలి గానీ.. ఇలా ఎంతకాలం పాటు రహదారులను నిర్బంధిస్తారని ప్రశ్నించిందే. దీంతో జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద స‌త్యాగ్ర‌హంపై నీలి నీడ‌లు అలుముకున్నాయి. న్యాయ‌స్థానాల నిల‌దీత‌తో రైతుల ఆందోళ‌న‌ల కొన‌సాగింపుపై చ‌ర్చ జ‌రుగుతోంది.