తన భర్త రాజీవ్ కనకాల ఎంతో బాధ, ఇబ్బంది పడ్డ విషయం తనకు తెలుసని ప్రముఖ యాంకర్ సుమ అన్నారు. ‘లవ్‌స్టోరీ’ సినిమాపై తన అభిప్రాయాల్ని ఆమె పంచుకునే సందర్భంలో ఎమోషనల్‌గా స్పందించారు.
‘లవ్‌స్టోరీ’లో రేవంత్‌గా నాగచైతన్య, మౌనికగా సాయిపల్లవి నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. సాయిపల్లవి బాబాయ్ పాత్రలో రాజీవ్ నటించారు. అమ్మాయిలపై లైంగిక దాడులకు కుటుంబసభ్యులే పాల్పడుతున్నారనే వాస్తవాన్ని శేఖర్ కమ్ముల ఈ సినిమాలో కళ్లకు కట్టారు.
రాజీవ్ కనకాల నటించిన సినిమా కావడంతో సహజంగానే సుమ అభిప్రాయం ఆసక్తి కలిగిస్తోంది. ఇన్‌స్టా వేదికగా ‘లవ్‌స్టోరీ’పై తనదైన స్టైల్‌లో ఆమె ప్రశంసలు కురిపించారు. తన భర్త నటన గురించి అద్భుతహః అన్న రీతిలో పొగడ్తలు కురిపించడం విశేషం. అలాగే రాజీవ్ స్టిల్స్‌ను షేర్ చేశారు.
‘అతి తక్కువ మంది నటీనటులు మాత్రమే తమ నటనతో మన మనస్సులను తాకుతారు. అలాంటి నటీనటుల్లో నా భర్త రాజీవ్ కూడా ఒకరు. నరసింహంగా ఎంతో అద్భుతంగా నటించినందుకు అభినందనలు. నాకు తెలుసు ఆ పాత్ర చేయడానికి నువ్వు ఎంతో బాధ, ఇబ్బందిపడ్డావనీ.. కానీ, ఎంతోమంది జీవితాలను నువ్వు ప్రభావితం చేశావు. ఇలాంటి సున్నితమైన కథను మరింత సున్నితంగా తెరకెక్కించిన శేఖర్ కమ్ముల, చైతన్యలకు ధన్యవాదాలు. సాయిపల్లవి డ్యాన్స్ చూసి నా కళ్లు అలసిపోయాయి. డ్యాన్స్ ఎక్కడ మిస్ అవుతానోనని కంటి రెప్ప కూడా వాల్చలేదు. మరోసారి టీమ్ మొత్తానికి అభినందనలు’ అని సుమ పేర్కొన్నారు.
రాజీవ్ కనకాల, సుమ మధ్య విభేదాలున్నాయని ఎప్పటి నుంచో వార్తలొస్తున్న నేపథ్యంలో ఆమె తాజా ప్రశంసలు కొన్నింటికి సమాధానాలు చెప్పినట్టైందని నెటిజన్లు అంటున్నారు.