ఏపీలో అనుకున్నదే జరుగుతోంది. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి ఉంది, అదే సమయంలో స్థానికంగా ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం అసంతృప్తి నెలకొని ఉంది. వైసీపీకి ఉన్న 151మంది ఎమ్మెల్యేలలో మొత్తం 66మందిపై మరకలున్నాయి. వీరిలో 46మంది పెర్ఫామెన్స్ మరీ పూర్.
కేవలం 27శాతం మార్కులే వచ్చాయి. 20 మంది ఎమ్మెల్యేలు 27 నుంచి 35 శాతం మధ్యలో మార్కులు తెచ్చుకున్నారు. ఇక ఎంపీల విషయానికొస్తే వైసీపీకి ఉన్న 22మందిలో 8 మందిపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఆత్మసాక్షి గ్రూప్ చేపట్టిన ఈ సర్వే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మూడు విడతలుగా ఏపీలో సాగింది.
ఐఐటీ స్టూడెంట్స్ చేపట్టిన ఈ సర్వేలో మొత్తం 13 జిల్లాల్లో 68,200 మంది వద్ద వివరాలు సేకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వైసీపీదే విజయం కానీ, స్థానికంగా మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలపై అసంతృప్తి ఉందనేది వాస్తవం అంటోంది ఆత్మసాక్షి గ్రూప్.
ఇక మంత్రుల విషయానికొస్తే అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, శంకర నారాయణ, గుమ్మనూరు జయరాం, తానేటి వనిత, శ్రీరంగనాథ రాజు, ధర్మాన కృష్ణదాస్, పినిపే విశ్వరూప్, అవంతి శ్రీనివాస్.. వీరందరిపై ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉందట. మొత్తం 11మంది మంత్రులు ఎమ్మెల్యేలుగా స్థానిక నియోజకవర్గాల్లో పట్టు సాధించలేకపోయారని సర్వే సారాంశం.
టీడీపీది అధోగతే..
వైసీపీలో అయినా చెప్పుకోడానికి కొన్ని పేర్లే ఉన్నాయి. టీడీపీ విషయానికొస్తే చంద్రబాబు సహా పార్టీ తరపున గెలిచిన అందరు ఎమ్మెల్యేలదీ అదే బాపతు. టీడీపీ ఎమ్మెల్యేలందరి పర్ఫామెన్స్ 27శాతం కంటే తక్కువగా ఉంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బాబుతో సహా అందరూ ఓడిపోవాల్సిందే.
ఇక ఓవరాల్ గా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో సదభిప్రాయం ఉందని ఈ సర్వే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీదే ఘన విజయమని తెలుస్తున్నా.. పనితీరు సరిగాలేని ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎన్నికలకింకా రెండున్నరేళ్ల సమయం ఉన్న ఈ దశలో.. ఎమ్మెల్యేలకు నిజంగా ఇదో హెచ్చరికలాంటిది.
ఇకపై అయినా కేవలం జగన్ వేవ్ ని మాత్రమే నమ్ముకోకుండా.. తమ ఇమేజ్ కూడా పెంచుకోగలిగితేనే.. ఆయా ఎమ్మెల్యేలకు లాభం, వారి వల్ల పార్టీకి కూడా లాభం. లేకపోతే వారంతా జగన్ కు గుదిబండల్లా మారడం ఖాయం.