పవర్ స్టార్ సినిమా ట్రయిలర్ బయటకు వదిలారు ఆర్జీవీ. ఎలా వుంది. ఏమిటి హడావుడి అన్నది పక్కన పెడితే ట్రయిలర్ లో చూపించిన ఓ సీన్ మాత్రం చాలా అంటే చాలా అభ్యంతరకరంగా వుంది. అలా అని మిగిలిన సీన్లు బాగున్నాయా అన్నది కాదు పాయింట్. చాలా సీన్లు జనాలు అనుకునేవే. జనం పవన్ కు జేజేలు పలికారు కానీ ఓట్లు వేయలేదు. జగన్ సిఎమ్ కాదు అని పవన్ అన్నాడు. మెగాస్టార్ బ్యాకింగ్ తోనే తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలాంటివి అన్నీ పెద్ద వాస్తవ దూరాలు కావు.
కానీ పవన్ కళ్యాణ్ చేత త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కొట్టించడం అన్నది మాత్రం చాలా దారుణమైన ఆలోచనగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది అని కానీ, జరిగింది అని వినిపించిన గ్యాసిప్ కానీ ఎప్పుడూ లేదు. పైగా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ స్థాయి వేరు. రాజమౌళి ప్రపంచ స్థాయి డైరక్టర్ కావచ్చు. ఇంకా టాప్ డైరక్టర్లు చాలా మంది వుండొచ్చు. కానీ రాజమౌళి నే. కానీ త్రివిక్రమ్ కు గురూజీ అనే గౌరవం వుంది.
మంచి సలహాలు, సాన్నిహిత్యంతో త్రివిక్రమ్ హీరోల మనసుకు దగ్గరగా వుంటారు. ఎన్టీఆర్ తన తండ్రి పోయిన తరువాత ఓసారి స్టేజ్ మీద త్రివిక్రమ్ గురించి మాట్లాడిన మాటలు అందరికీ తెలుసు. హీరోలు అంతా త్రివిక్రమ్ కు ఇచ్చే గౌరవం కేవలం టాప్ డైరక్టర్ అని కాదు. అది ఆయన మీద, ఆయన వ్యక్తిత్వం మీద వున్న అభిమానం.
అలాంటిది పవన్ చేత త్రివిక్రమ్ కొట్టించిన సీన్ తీసి ఆర్జీవీ మానసిక ఆనందం పొందితే పొంది వుండొచ్చు. కానీ అంత మాత్రం చేత త్రివిక్రమ్ గౌరవం ఏమాత్రం తగ్గదు. కొండ చూసి కుక్క మొరిగితే కొండకు చేటా? అనే అరవింద సమేతలోని ఎన్టీఆర్ డైలాగును త్రివిక్రమ్ ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటే అది ఎవరి తప్పూ కాదు. ఒక్క ఆర్జీవీది తప్ప.