ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. కాంగ్రెస్ లో పలుమార్లు మంత్రిగా చక్రం తిప్పారు. కీలకమైన శాఖలను కూడా చూశారు. ఆ టైంలో అన్న క్రిష్ణ దాస్, కానీ సీదరి అప్పలరాజు కానీ పెద్దగా రాజకీయం ఊసూ ధ్యాసా లేకుండా ఉండి ఉంటారు.
అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత క్రిష్ణ దాస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వైఎస్సార్ ద్వారా టికెట్ అందుకున్నారు. కాంగ్రెస్ కంటే వైఎస్సార్ కుటుంబాన్నే గట్టిగా నమ్ముకున్నారు. వైఎస్సార్ దుర్మరణం తరువాత ఆయన నాడే జగన్ కి వీర విధేయుడిగా నిలిచి వెంట నడిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచి వైసీపీ ఎమ్మెల్యేగా క్రిష్ణ దాస్ ముద్ర వేసుకున్నారు.
నాటి నిబధ్ధతకు ప్రతిఫలాన్నే ఇపుడు ఆయన అనుభవిస్తున్నారు. జగన్ మెచ్చిన నేతగా తొలి విడతలోనే మంత్రిగా అయిన క్రిష్ణ దాస్ ఇపుడు ఉప ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు. ఇక ఆయన వైసీపీ క్యాబినేట్లో అయిదేళ్ళ మంత్రి అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మాన కుటుంబంలో అన్న గారు మంత్రిగా ఉంటే మాజీ మంత్రి తమ్ముడు ప్రసాదరావుకి అవకాశం రాదు అన్నది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక మరో మంత్రి సీదరి అప్పలరాజు. ఈయన కూడా ప్రసాదరావు శిష్యుడే. గురువు సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా ఉంటే శిష్యుడు గెలిచిన ఏడాదిలోనే మంత్రి సీటు పట్టేశారు. ఓ విధంగా తాను ఏరి కోరి రాజకీయాల్లోకి తెచ్చిన అన్న గారు, మరో వైపు శిష్యుడు ఇద్దరూ మంత్రులుగా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం కంటే అసలైన ఆనందం ప్రసాదరావుకు వేరే ఉండదని అంతా అంటున్నారు. అదే ఆయనకు ఇంత కాలం చేసిన రాజకీయానికి అసలైన ఫలమూ, వరమూ అనుకోవాలేమో.