పవన్ అంటే బాబుకు ప్రత్యేకమైన అభిమానం…

పవన్ కళ్యాణ్. టాలీవుడ్ టాప్ స్టార్. ఆయన 26 దాకా సినిమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. ఆయకంటూ ఒక స్టైల్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల పవన్ అభిమానులు అంటే పెద్ద ఎత్తునే…

పవన్ కళ్యాణ్. టాలీవుడ్ టాప్ స్టార్. ఆయన 26 దాకా సినిమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. ఆయకంటూ ఒక స్టైల్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల పవన్ అభిమానులు అంటే పెద్ద ఎత్తునే ఉంటారు. అయితే వీరందరూ కాకుండా మరో పెద్ద అభిమాని కూడా పవన్ కి ఉన్నారని అంటున్నారు విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. 

పవన్ అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఆయన చెబుతున్నారు. అంటే పవన్ స్టార్ కి బాబు కూడా బిగ్ ఫ్యాన్ అనుకోవాలి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ జనసేనతో మళ్లీ టీడీపీ కలసి పోటీ చేస్తుంది అంటున్నారు బండారు వారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని కూడా ఆయన ముందే జోస్యం చెబుతున్నారు.

అంతే కాదు వైసీపీ సర్కార్ 2023 దాకా అధికారంలో ఉండదని, ముందే కుప్పకూలుతుందని కూడా జాతకం చెబుతున్నారు. మొత్తానికి బండారు వారి ఆశలు ఆశయాలు ఏంటి అన్నది కచ్చితంగా చెప్పేశారు. ఎక్కడా మనసులో దాచుకోకుండా అన్నీ పూసగుచ్చినట్లుగా వివరించేశారు. టీడీపీతో జనసేన పొత్తు కుదరాలి, వైసీపీని ఓడించాలి, తాము మళ్ళీ అధికారంలోకి రావాలి. 

అచ్చం బాబు మనసులో మాటనే తెలుగు తమ్ముడు జనాలకు వినిపించాడనుకోవాలి. అది సరే కానీ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ టీడీపీని ఒక్క మాట అనలేదు కానీ వ్యూహాలను మారుస్తామని అంటున్నారు. ఈసారి సరి కొత్త స్ట్రాటజీతో పాలిటిక్స్ చేస్తామని కూడా పవన్ చెబుతున్నారు. మరి దాని అర్ధం ఇదేనా అన్న డౌట్లు కూడా అందరిలోనూ  ఒక్క సారిగా కలుగుతున్నాయి.

దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఈ మధ్య జరిగిన పరిషత్ ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ జనసేన కలసి పొత్తులు పెట్టుకున్నాయి. అది ఒక విధంగా ఈ రెండు పార్టీల కలయికకు నాందిగా చెప్పుకోవాలేమో. దానితోనే టీడీపీ మాజీ మంత్రులకు కొత్త ఆశలు పుడుతున్నాయి. 

గోదావరి జిల్లాలకు చెందిన పితాని సత్యనారాయణ ముందుగా దీని మీద బాగానే  మాట్లాడారు. జనసేన టీడీపీ పొత్తు పెట్తుకోవాల్సిందే అంటూ ఆయన ఒక రకమైన  డిమాండ్ చేశారు. ఇపుడు అది కాస్తా మరింత విస్తరించి విశాఖ టీడీపీ నేతల నోటి వెంట కూడా ఇదే మాట అనిపిస్తోంది అనుకోవాలేమో.

అందుకే బండారు వారు పుసుక్కున మాట అనేశారు. ఆయన చాలా ధీమాగానే చెబుతున్నారు కూడా. పవన్ ఎక్కడికీ పోరు, తమతోనే ఉంటారని కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఎటూ వైసీపీ అంటే పవన్ కి కోపం ఉంది. ఆయన రాజకీయంగా విభేదించే ఏకైక పార్టీ కూడా బహుశా ఏపీలో వైసీపీ అయి ఉండాలి. 

మరి ఆ లెక్కన చూసుకుంటే రేపటి రోజున అధికారంలోకి వస్తామని రావాలని పట్టుదలగా ఉన్న టీడీపీకి ఇది వరమే అవుతుంది. పవన్ వైసీపీ మీద ఆ పార్టీ అధినాయకుల మీద  పళ్ళు నూరడం కచ్చితంగా తమకే కలసి వస్తుందని టీడీపీ తమ్ముళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు అంటే అది వారి తప్పు కానే కాదు.

ఇక ఈ నేపధ్యంలో పవన్ని వెనకేసుకుని వస్తూ వైసీపీ మీద విమర్శలు చేసేవారు కూడా ఎక్కువగా టీడీపీలో కనిపిస్తున్నారు. ఎంటువంటి జంకూ గొంకూ లేకుండా పవన్ మావాడే అనిపించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అయితే పవన్ నోటి వెంట మాత్రం ఈ రోజుకీ టీడీపీతో పొత్తు అన్న మాట అయితే రాలేదు. కానీ ఆయన మాటలు, చేష్టలు, ఇస్తున్న సంకేతాలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయని అంటున్నారు. 

ఆయన కొత్త రాజకీయం అంటున్నారంటే అది కచ్చితంగా టీడీపీ రూటే అని తమ్ముళ్ళు భాష్యం చెప్పేసుకుంటున్నారు. ఈ రకమైన విశ్లేషణతోనే ధైర్యం చేసి మరీ బండారు పవన్ తో పొత్తులు ఉంటాయని తేల్చేశారు అని అంటున్నారు. అయితే ఈ పొత్తు కొత్త కాదు, ఈ ఆశ కొత్త కాదు, కానీ రాజకీయాలే ఎపుడూ కొత్తగా ఉంటాయి. అందుకే  పవన్ మాటలు, తమ్ముళ్ల ఆశలు ఫలిస్తాయా, కలుస్తాయా అన్నది వేచి చూడాల్సి ఉంది.