జగన్ పై బాబు ప్రధాన అస్త్రం అదేనా..?

ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఇంట్లో కూర్చున్న మొదటి రోజు నుంచి చంద్రబాబు ఆలోచిస్తోంది ఒకటే. జగన్ ఎక్కడ దొరుకుతారా, ఏ విషయంలో జగన్ ని కార్నర్ చేయాలా అని చంద్రబాబు ఎదురుచూస్తూనే ఉన్నారు. అలా…

ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఇంట్లో కూర్చున్న మొదటి రోజు నుంచి చంద్రబాబు ఆలోచిస్తోంది ఒకటే. జగన్ ఎక్కడ దొరుకుతారా, ఏ విషయంలో జగన్ ని కార్నర్ చేయాలా అని చంద్రబాబు ఎదురుచూస్తూనే ఉన్నారు. అలా రెండేళ్లకు పైగా నిరీక్షిస్తూనే ఉన్నారు. 

ఎట్టకేలకు జగన్ దొరికారు. ప్రస్తుతం ఏపీకి అప్పులు  పెరిగిపోయాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా, ఎన్ని కారణాలు చెప్పుకున్నా.. ఆంధ్ర అప్పుల కుప్పగా మారింది. ఇప్పుడిదే అంశం బాబుకు ప్రధాన అస్త్రంగా మారబోతోంది. రాబోయే ఎన్నికల్లో దీని చుట్టూనే బాబు రాజకీయం చేయబోతున్నారు.

ఆంధ్రా అప్పుల్లో కూరుకుపోయిందనే విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చేరవేసేలా పథకం పన్నారు చంద్రబాబు. అనుకూల మీడియాలో రాతలు చూస్తే ఎవరికైనా ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. దీనికితోడు సంపద సృష్టి జరగలేదని, అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల స్థాపన లాంటివి జరగలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు ఫిక్స్ అయిపోయారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఈ అంశాలనే ఎన్నికల అస్త్రాలుగా మలుచుకోవాలని డిసైడ్ అయ్యారు.

వాస్తవానికి సంక్షేమ పథకాల అమలులో జగన్ దొరికిపోతారని భావించారు చంద్రబాబు. నవరత్నాలు పేరుతో అడిగినవారికి, అడగని వారికి.. అందరికీ ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు జగన్. 

ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా.. చాలా వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చారు. దీంతో ఆయా వర్గాలు ఫుల్ హ్యాపీ. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం నాలుగు రోజులు లేటయింది కానీ, ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం కాలేదు. వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్లి మరీ పింఛన్లు ఇస్తున్నారు.

ఈ దశలో నవరత్నాలను టచ్ చేసినా, ఆ పేరు ప్రస్తావించినా అది చంద్రబాబుకే రివర్స్ లో తగులుతుంది. అందుకే ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించకుండా కేవలం అప్పులను మాత్రమే హైలెట్ చేయాలని భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే తన మీడియాను ఇప్పట్నుంచే ప్రిపేర్ చేస్తున్నారు.

జగన్ దొరికిపోయినట్టేనా..?

జగన్ నిజంగానే చంద్రబాబుకి దొరికిపోయారా అంటే పూర్తిగా అవునని చెప్పలేం. ఇప్పటికిప్పుడు ఏపీ అప్పులు భారీగానే ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఆదాయం పెరిగితే జగన్ అన్నిటినీ సమర్థంగా ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే కరోనా వల్ల అది సాధ్యం కావడంలేదు. 

భవిష్యత్తులో కరోనా పీడ పూర్తిగా తొలగిపోయి, ఏపీకి ఆదాయం పెరిగితే మాత్రం చంద్రబాబు పప్పులు ఉడకవు. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి చక్కబడితే, ఏపీ ఆర్థిక వ్యవస్థ కూడా పురోగమిస్తుంది. జగన్ కి ధీమా పెరుగుతుంది.

మరీ ముఖ్యంగా 95శాతం సంక్షేమ పథకాల్ని గాడిలో పెట్టిన జగన్, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి అభివృద్ధిని కూడా చూపించి, బాబు ఎత్తులకు చేతలతో సమాధానం ఇవ్వబోతున్నారు.

ఈ రెండేళ్లలో జగన్ చేయాల్సిందేంటి..?

ఏపీని అప్పుల కుప్పలా మార్చారనే నింద ఎలాగూ జగన్ పై పడింది. గతంలో చంద్రబాబు వల్లే ఇదంతా అని చెప్పుకున్నా కూడా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ అదే నిజమైనా.. ఈ రెండున్నరేళ్లలో మీరేం చేశారు అనే ప్రశ్న ఎదురవుతుంది. అందుకే ఆదాయం పెంచుకోవడంతో పాటు, ఖర్చు తగ్గించుకునే దిశగా జగన్ అడుగులు వేస్తే మరీ మంచిది.

అనర్హులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని వెంటనే ఆపేయాలి. ఆ మిగులుతో.. రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సౌకర్యాలు కల్పించారు. గ్రామంలో ప్రభుత్వ బడికి కార్పొరేట్ హంగులొచ్చాయని సంబర పడాలా.. బడి ముందు గుంతల రోడ్డు ఉందని బాధపడాలా అనే పరిస్థితిలో ఉన్నారు జనాలు. స్కూల్ అద్దంలా మెరిసిపోవచ్చు కానీ, స్కూల్ కి వచ్చేందుకు బురదరోడ్డే పిల్లలకు గతి అంటే మాత్రం ఆలోచించాల్సిన పరిస్థితి.

అందుకే జగన్ అన్నిటిపై దృష్టిపెట్టాలి. అన్ని రంగాలను సంతృప్తి పరచాలి. ఆర్థిక సాయం అందిందన్న సంతోషంతో జనాలు జగన్ కి ఓట్లు వేయొచ్చు కానీ, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం మాయలో కూడా పడే ప్రమాదం ఉంది. అందుకే జగన్ ఈ రెండున్నరేళ్లలో రాష్ట్ర అప్పుల్ని కవర్ చేసేందుకు ప్రయత్నించాలి. అదే జరిగితే 2024 ఎన్నికల్లో బాబు మరింత పాతాళానికి పడిపోవడం ఖాయం.