కూర్చున్న కొమ్మను నరుక్కున్న పవన్ కల్యాణ్

“వైసీపీ నేతలందరికీ వ్యాపారాలున్నాయి. రాజకీయాలతో పాటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. అలాంటప్పుడు నేను సినిమాలు చేస్తే తప్పేంటి” అంటూ వాదించిన పవన్ కల్యాణ్.. చెప్పినట్టుగానే సినిమాల్లోకి వెళ్లిపోయారు.  Advertisement ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు.…

“వైసీపీ నేతలందరికీ వ్యాపారాలున్నాయి. రాజకీయాలతో పాటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. అలాంటప్పుడు నేను సినిమాలు చేస్తే తప్పేంటి” అంటూ వాదించిన పవన్ కల్యాణ్.. చెప్పినట్టుగానే సినిమాల్లోకి వెళ్లిపోయారు. 

ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఆపుతారో కూడా తెలీదు. తనకు సినిమా రంగం నుంచి కాకుండా మరో రంగం నుంచి ఆదాయం రాదని, కాబట్టి పార్టీని నడపాలన్నా, సిబ్బందికి జీతాలివ్వాలన్నా సినిమాలు చేయాల్సిందేనంటూ తనకుతాను ప్రకటించుకున్నారు పవన్.

అలా సినిమా ఇండస్ట్రీ తనకు ఎంతో ఇచ్చిందని చెప్పుకుంటున్న పవన్.. ఇప్పుడా ఇండస్ట్రీకే దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నారు పవన్ కల్యాణ్.

ఓవైపు సినిమా రంగం నుంచి పూర్తిగా లబ్ది పొందుతూ, మరోవైపు తనకు అస్సలు సినిమాలు చేయడం ఇష్టంలేదని చెప్పడం పవన్ కే చెల్లింది. కేవలం ఓ 10 మంది కోసం మాత్రమే ప్రస్తుతం తను సినిమాలు చేస్తున్నానని చెప్పిన పవన్.. తన అభిమానుల కోసం మాత్రం సినిమాలు చేయడం లేదని, కేవలం డబ్బు  కోసమే సినిమాలు చేస్తున్నానని పరోక్షంగా వెల్లడించారు.

ఓవైపు ఇండస్ట్రీతో ఇంత అవసరం పెట్టుకొని, మరోవైపు తన నోటిదురుసుతో అదే ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంచు విష్ణు, దిల్ రాజు తోపాటు ఏకంగా నిర్మాతల మండలి కూడా ఖండించిందంటే పవన్ ఇండస్ట్రీకి ఎంత డ్యామేజీ చేశారో అర్థంచేసుకోవచ్చు.

ఏరు దాటి తెప్ప తగలేసిన పవన్

ప్రస్తుతం చేతిలో  ఉన్న సినిమాల్ని మినహాయిస్తే.. వాటి తర్వాత పవన్ తో సినిమాలు నిర్మించడానికి బడా నిర్మాతలు ముందుకొస్తారా అనేది డౌట్. ఎందుకంటే, పవన్ వ్యవహారశైలితో వాళ్లు పెద్ద రిస్క్ చేసినట్టు అవుతుంది. మరోవైపు ఇక సినిమాలు చాలించాలనే ఆలోచనతోనే పవన్ ఇలా ఇండస్ట్రీతో వ్యూహాత్మకంగా తెగతెంపులు చేసుకున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది.

తను తీసుకున్న అడ్వాన్సులకు తగ్గట్టు సినిమాలు చేసేసి, మళ్లీ టాలీవుడ్ కు తాత్కాలికంగా బై చెప్పే ఆలోచనలో పవన్ ఉన్నారని, అందుకే ఏరు దాటి తెప్ప తగలేసే టైపులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తప్పుకుంటున్నారనే అంటున్నారు. ఈ వాదనల సంగతి పక్కనపెడితే.. గుడ్డ కాల్చి పరిశ్రమపై పడేయడం అనేది మాత్రం పవన్ చేసిన అతి పెద్ద తప్పు. రాబోయే రోజుల్లో ఇది ఆయన ఫిలిం కెరీర్ కు అతిపెద్ద స్పీడ్ బ్రేకర్ కాబోతోంది.

ఇక్కడ కూడా పవన్-చిరు మధ్య అదే తేడా!

సినిమాలు చేయడం చేయకపోవడం అనేది నటుడి ఇష్టం. కానీ బ్రేక్ ఇచ్చి, మళ్లీ తిరిగొచ్చాక ఇండస్ట్రీ అదే రీతిలో ఆహ్వానం పలకాలంటే మాత్రం హుందాగా విరామం ప్రకటించాలి. చిరంజీవి చేసింది అదే. రాజకీయాల్లోకి వచ్చినా చౌకబారు విమర్శలతో తన పేరు చెడగొట్టుకోలేదు. 

ఇండస్ట్రీతో, సినీ పెద్దలతో  సత్సంబంధాలు నెరిపారు. ఆ సంబంధాలే ఆయన రీఎంట్రీకి రెడ్ కార్పెట్ వేశాయి. కానీ పవన్ అలా చేయట్లేదు. రెండేళ్లలో ఎన్నికలు పెట్టుకుని, వైసీపీని ఓడించాలనే పెద్ద టార్గెట్ పెట్టుకుని ఇంకా సినిమాలు చేస్తానంటే కుదరదు. 

చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసే క్రమంలో, ఇండస్ట్రీ నుంచి అవమానకర రీతిలో, మద్దతు కరువై బయటకొచ్చేస్తున్నారు పవన్. రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అనుకుని మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా అప్పటికి పవన్ కి మద్దతిచ్చేవారెవరూ ఉండరు. ఇప్పుడు దేవుడంటూ దండాలు పెట్టినవాళ్లంతా అప్పటికి కొత్తదేవుళ్లను వెదుక్కునే ఉంటారు.