రైతు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎక్కడ? అనే నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి. “రైతు కోసం తెలుగుదేశం ” అనే కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుకెక్కుతారని అధికార పార్టీ ఆందోళన చెందింది. తీరా టీడీపీ ఆందోళన చూస్తే…ఓసోస్ ఈ మాత్రం దానికి అంతేసి ప్రచారమా? అనే సెటైర్స్ వినిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా ఆందోళనకు పిలుపునిచ్చిన టీడీపీ అగ్రనేతలు చంద్రబాబునాయుడు, లోకేశ్, అచ్చెన్నాయుడు ఎక్కడా కనిపించకపోవడం విమర్శలకు తావిచ్చింది.
తాము ప్రత్యక్షంగా పాల్గొని టీడీపీ శ్రేణులకి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్య నాయకులే పలాయనం చిత్తగించడం ఏంటనే ప్రశ్నలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ చేపట్టిన రైతు కోసం కార్యక్రమం గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే అంతో ఇంతో జరగడం గమనార్హం.
దీన్ని బట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏ స్థాయిలో నిరాశనిస్పృహల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ముఖ్యంగా పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉండడం కూడా కార్యక్రమం విఫలమవడానికి కారణంగా చెబుతున్నారు.