తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. రెండిటికీ చాలా తేడా ఉంది. అధినాయకుల తీరుతోనే ఈ విషయం స్పష్టమైంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలనాటికి చంద్రబాబు యమా స్పీడ్ గా ఉన్నారు. వైసీపీపై బదులు తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు.
జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో జనం విసిగిపోయారని చెప్పారు. తిరుపతిలో టీడీపీకే పట్టం కడతారని ఆశించారు. కానీ చంద్రబాబు మేకపోతు గాంభీర్యం తిరుపతిలో అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే వైసీపీ ఊహించింది కూడా వంద శాతం జరగలేదు.
ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నిక విషయానికొస్తే వైసీపీ జోరు పెంచింది. టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించి అక్కడితో ఆ విషయాన్ని మరచిపోగా.. సీఎం జగన్ కూడా ఎన్నికల షెడ్యూల్ కి ముందే అభ్యర్థిని ప్రకటించి ఎలక్షన్ మూడ్ క్రియేట్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బద్వేల్ బైపోల్ కి ఇన్ చార్జిగా పెట్టారు, మండలానికో ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించారు.
గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల విషయంలోనూ ఇదే జరిగినా, ఈసారి మాత్రం జగన్ నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచీ జాగ్రత్తపడటం విశేషం. అంతే కాదు.. రేపు, ఎల్లుండి కడప జిల్లా టూర్ ఫిక్స్ చేసుకున్నారు జగన్. ఈ టూర్ కీ, బద్వేల్ బైపోల్ కీ నేరుగా సంబంధం ఉందని చెప్పలేం కానీ, జిల్లాలోని కీలక నేతల్లో చురుకు పుట్టించేందుకే జగన్ ఈ పర్యటన ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
తిరుపతి వేరు, బద్వేల్ వేరు..
కరోనా కష్టకాలంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓట్ల శాతం పెరిగినా, టీడీపీ కూడా తన ఉనికి చాటుకుంది. టీడీపీ అభ్యర్థి పనబాకకు 32శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీ 4లక్షల పైచిలుకు మెజార్టీ ఆశించింది. కానీ అది 2లక్షల 71వేల దగ్గర ఆగిపోయింది. దీంతో బద్వేల్ విషయంలో ఉదాసీనత కూడదని నాయకులకు వార్నింగ్ ఇచ్చారు జగన్.
భారీ మెజార్టీ రావాలని, వైసీపీ ఓట్ల శాతం పెరగడంతో పాటు, ఎగిరెగిరిపడే ప్రతిపక్షాలకు ఇది పూర్తి స్థాయి గుణపాఠం కావాలనేది జగన్ ఆలోచన. స్థానిక ఎన్నికల్లోలాగే.. టీడీపీకి డిపాజిట్ గల్లంతు చేస్తే.. ఆ ప్రభావం కచ్చితంగా 2024 ఎన్నికల వరకు ఉంటుందనేది జగన్ వ్యూగం. దానికి తగ్గట్టుగానే ఇప్పటినుంచే పావులు కదపడం మొదలు పెట్టారు.
అటు పరిషత్ ఎన్నికలిచ్చిన షాకుతో.. చంద్రబాబు బద్వేల్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు వెనకడుగేస్తున్నారు. ఊరికి ముందే అభ్యర్థిని ప్రకటించినా, మిగతా వ్యూహ రచనలో మాత్రం డల్ అయ్యారు.