పిటిష‌న‌ర్‌కు వాయింపే…వాయింపు!

ఏపీ ప్ర‌భుత్వంపై హైకోర్టులో పిటిష‌న్ వేయ‌డం ప్యాష‌న్ అయిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో డిజిట‌ల్ చెల్లింపుల విధానాన్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ పిల్ వేసిన‌ ప్ర‌కాశం జిల్లా జాండ్ర‌పేట‌కు…

ఏపీ ప్ర‌భుత్వంపై హైకోర్టులో పిటిష‌న్ వేయ‌డం ప్యాష‌న్ అయిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో డిజిట‌ల్ చెల్లింపుల విధానాన్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ పిల్ వేసిన‌ ప్ర‌కాశం జిల్లా జాండ్ర‌పేట‌కు చెందిన దాస‌రి ఇమ్మాన్యుయేల్‌కు హైకోర్టులో వాయింపే..వాయింపు. ఇటీవ‌ల కాలంలో పిటిష‌న‌ర్‌పై ఈ స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఘ‌ట‌న‌లు లేవనే చర్చ న్యాయ‌వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

దాస‌రి ఇమ్మాన్యుయేల్ పిల్‌పై గురువారం సీజే జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యల ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీబీసీఎల్‌) త‌ర‌పు న్యాయ‌వాది  పి.నరసింహమూర్తి  వాదిస్తూ ద‌స‌రా నాటికి ఏపీలో అన్ని మ‌ద్యం దుకాణాల్లో డిజిట‌ల్ రూపంలో చెల్లింపుల విధానం అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్నారు. బ్యాంకులు కూడా చెల్లింపులకు అంగీకరించాయన్నారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగ ప్రవీణ్‌ స్పందిస్తూ.. మద్యం విక్రయాలను ఆధార్‌తో అనుసంధానం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మద్యం విక్రయాలను ఆధార్‌తో అనుసంధానించడం ఏమిటంటూ పిటిష‌న‌ర్‌పై హైకోర్టు ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అయితే మద్యం కొనుగోలుదారుల్లో చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారని వారు రోజూ రూ.200–రూ.300 వరకు మద్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రవీణ్‌ చెప్పారు.

ధ‌ర్మాసనం జోక్యం చేసుకుంటూ… మద్యంపై ఎవరెంత ఖర్చు చేస్తున్నారు, ఎవరెంత తాగుతున్నారో పిటిషనర్‌కెందుకని గ‌ట్టిగా నిల‌దీసింది. మద్యం సేవించే గోప్యత కూడా ఇవ్వరా అంటూ ప్ర‌శ్నించింది. ఇతరుల జీవితాల్లోకి ఎందుకు తొంగిచూస్తున్నారని ప్రశ్నించింది. అందరి సమాచారం అడుగుతున్నారు.. మరి పిటిషనర్‌ ఏం చేస్తుంటారని హైకోర్టు ధ‌ర్మాస‌నం నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. పిటిష‌న‌ర్ స‌మాచార హ‌క్కు చ‌ట్టం యాక్టివిస్ట్ అని చెప్పారు.

పిటిష‌న‌ర్ ఇంకా ఏం చేస్తుంటార‌ని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించ‌గా ప్రవీణ్‌ సమాధానం చెప్పలేకపోయారు. మీ గురించి చెప్పడానికి మాత్రం ఇష్టపడర‌ని, వూరోళ్ల సంగ‌తులు మాత్రం అన్నీ కావాలా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో న్యాయ‌వాది మౌనం పాటించారు. ఈ ఎపిసోడ్ న్యాయ‌వ‌ర్గాల్లో, పౌర‌స‌మాజంలో చ‌ర్చ‌కు దారి తీసింది.