ఎవడి డప్పు వాడు కొట్టుకుంటే.. అది కామెడీ అవుతుంది. తెలుగునాట నేను, నా వ్యక్తిత్వం, నా విలువలు.. అంటూ ఒక స్టార్ హీరో డప్పేసుకుంటూ ఉన్నాడు! అరే.. బాబూ.. నువ్వు పాటించే విలువల గురించి నువ్వు చెప్పుకోవడం ఏమిటోయ్.. నీ చుట్టూ ఉన్న వాళ్లు, నీతో ఉన్న వాళ్లు.. నీ విలువల గురించి చెబితే, వినేవాళ్లు కూడా ఆహా.. అనుకుంటారు! నీతో సంసారం చేసిన నీ మాజీ భార్యే.. నువ్వు తనతో కాపురం చేస్తూ మరొకరికి గర్భం చేశామని వాపోయిందాయె.. ఇంతోటి దానికి నువ్వు నీ విలువలు, వ్యక్తిత్వం, నీ పెంపకం గురించి.. మాట్లాడతావేంటోయ్! అని జనసామాన్యం అనుకుంటారని ఆ స్టార్ హీరోకి అర్థం కాదా? బుర్రలో ఏం లేదా? అనే సందేహాలు రావొచ్చు.
ఇక తెలుగునాట స్టార్ హీరోల తరఫున వాళ్లే డప్పులు వాయించుకోవడం, లేదా కులసంఘాల వాళ్లు డప్పులేయడం వినీవినీ విసుగుపుడుతోంది. మా బ్లడ్డు వేరు, మా బ్రీడు వేరని చెప్పుకుంటూ.. తమో విలక్షణమైన జంతువులు అయినట్టుగా వారే చెప్పుకుంటూ ఉన్నారు! బ్రీడు అనే మాట జంతువులకే వాడతారు సుమా!
ఇలాంటి సినీ రణగొణ డప్పుల వాతావరణంలో తెలుగు వారు ఉండగా.. తమిళ అలనాటి సూపర్ స్టార్ శివాజీ గణేషన్ జయంతి సందర్భంగా గూగుల్ ఇండియా ఒక డూడుల్ ను పెట్టింది. శివాజీ 93వ జయంతి నేడు. ఈ సందర్భంగా డూడుల్ తో నివాళి ఘటించింది గూగుల్. ఏదేశానికి ఆ దేశంలో అక్కడ ప్రత్యేక సందర్భాలను డూడుల్ తో గుర్తు చేయడం, సెలబ్రేట్ చేయడం గూగుల్ అలవాటే. ఈ క్రమంలో అత్యంత ఆదరణ కలిగిన భారతీయ నటుల్లో ఒకరిగా శివాజీని మెన్షన్ చేసింది. ఇది శివాజీ అభిమానులకూ, తమిళులకూ హాయిని ఇస్తోంది!
మరి తెలుగునాట ఎవరి డప్పులు వాళ్లు కొట్టుకుంటున్నారు. శివాజీ కన్నా తెలుగునాట గొప్ప నటులు ఉండవచ్చు. మరి అలాంటి వారిని ఇలా పరాయి వాళ్లు, తటస్థులు స్మరిస్తే అది తెలుగు వారికీ అనందం కలిగిస్తుంది. అంత వరకూ ఎవరి డప్పులు వాళ్లు ఆపితే.. జనాలకూ రిలీఫ్! సినిమాల్లో నటించినంత మాత్రానా.. మీరెవరూ దేవుళ్లు కాదు అని లివింగ్ స్టార్ హీరోలు గుర్తుంచుకుంటే మంచిది!