పవన్ నోటి దురుసు.. పూర్తిగా టాలీవుడ్ సరెండర్

తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందనే సామెత ఉంది. ఇప్పుడీ సామెత పవన్ కల్యాణ్ కు, టాలీవుడ్ కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఇన్నాళ్లూ మావాడు, మనవాడు అనుకున్న ఇండస్ట్రీని నడిసంద్రంలో ముంచేశారు పవన్. ఆయన…

తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందనే సామెత ఉంది. ఇప్పుడీ సామెత పవన్ కల్యాణ్ కు, టాలీవుడ్ కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఇన్నాళ్లూ మావాడు, మనవాడు అనుకున్న ఇండస్ట్రీని నడిసంద్రంలో ముంచేశారు పవన్. ఆయన చేసిన ఒకేఒక్క తిక్క పనికి ఇప్పుడు టోటల్ టాలీవుడ్ అంతా సరెండర్ అయింది. ఏపీ ప్రభుత్వానికి సాగిల పడుతోంది.

అసలే కరోనా దెబ్బ, ఆపై పవన్ దెబ్బ.. ఇంకేముంది టాలీవుడ్ కుదేలైంది. దిక్కుతోచని స్థితిలో సఫర్ అవుతోంది. టిక్కెట్ రేట్లు సవరింపు, వంద శాతం ఆక్యుపెన్సీపై మొన్నటివరకు కాస్త గంభీరంగా, ఇంకాస్త ఇగోతో ఉన్న వ్యక్తులంతా పవన్ దెబ్బతో ఏపీ ప్రభుత్వానికి సరెండర్ కాక తప్పలేదు. ఇప్పటికే పరిశ్రమకు కొన్ని స్క్రూలు బిగించారు జగన్. ఆ మాత్రం దానికే విలవిల్లాడిపోతోంది ఇండస్ట్రీ. ఇప్పుడు పవన్ దెబ్బతో ఇంకెన్ని స్క్రూలు బిగిస్తారోనని బెంబేలెత్తిపోతోంది.

పవన్ దిక్కుమాలిన స్పీచ్ తర్వాత వరుసగా జరిగిన, జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్ దీనస్థితికి అద్దంపడుతున్నాయి. నాగార్జున లాంటి పెద్ద నటుడు మింగలేక-కక్కలేక ఏపీ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. టాలీవుడ్ ను రెండు తెలుగు రాష్ట్రాలు చల్లగా చూడాలని కోరుకున్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా అదే స్థాయిలో సరెండర్ అయ్యారు.

కరోనా నుంచి ప్రజల్ని ఎలా రక్షించారో.. సినీపరిశ్రమను కూడా అలానే రక్షించాలని వేడుకున్నారు అల్లు అరవింద్. మీరు తలుచుకుంటే మాకు వరాలు ఇవ్వగలరు అంటూ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పని మొదలుపెట్టారు. విడుదలయ్యే సినిమాలన్నీ మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయంటూ వినమ్రంగా
విన్నవించుకున్నారు.

నాగార్జున, అరవింద్ కంటే ముందే దిల్ రాజు ఏకంగా రంగంలోకి దిగిపోయిన విషయం తెలిసిందే. పవన్ చేసిన డ్యామేజీకి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన దిల్ రాజు, ఏపీ ప్రభుత్వంతో కాస్త మంచి సంబంధాలున్న వ్యక్తులందర్నీ వెంట పెట్టుకొని మరీ వెళ్లి పేర్ని నానిని కలిశారు.

చకచకా జరిగిన తాజా పరిణామాలతో ఇప్పుడు ఇండస్ట్రీలోని మిగతా పెద్దలు కూడా ఎలర్ట్ అయ్యారు. చిరంజీవి, మోహన్ బాబు, సురేష్ బాబు, కృష్ణంరాజు లాంటి వ్యక్తులు తాజా వివాదాలు, సమస్యలపై కూలంకుషంగా చర్చించుకున్నారు. ఇప్పటివరకు ఎవరైతే ఓ టీమ్ గా ఏర్పడి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారో.. వాళ్లకు అదనంగా మరికొంతమందిని రాయబారం కోసం పంపించాలనుకుంటున్నారు.

మరోవైపు ఇండస్ట్రీ సమస్యలపై ముఖ్యమంత్రితో ఇప్పటికిప్పుడు చర్చించడానికి మంత్రి పేర్ని నాని విముఖత చూపించినట్టు తెలుస్తోంది. పవన్ స్పీచ్ లో కొన్ని పాయింట్లను ఇప్పటికే జగన్ చూశారని, పరిశ్రమ సమస్యలపై ఇప్పట్లో చర్చించే ఆలోచనలో లేరని కూడా తన సన్నిహితుల వద్ద నాని ప్రస్తావించినట్టు
తెలుస్తోంది.