పవన్‌కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌ని వణికించాయి. పవన్ రాజకీయ స్వార్థం కోసం తమను వాడుకోవడంపై సినీ పరిశ్రమ ముఖ్యులు ఆందోళన చెందుతున్నట్టు వారి మాటలను బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలను సొంత కుటుంబ సభ్యులు సమర్థించలేని పరిస్థితి.
సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయంపై వాడివేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదేదో ప్రభుత్వం సినిమా వాళ్ల సొమ్మును వాడుకునేందుకు వేసిన ఎత్తుగడగా పవన్‌కల్యాణ్, ఎల్లో మీడియా చిత్రకరించేందుకు ప్రయత్నించారు. అయితే తామే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు నిర్మాతలు చెప్పడంతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం గాలికి పోయింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలను విచారణ వ్యక్తం చేస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తనకు ఫోన్ చేసి చెప్పినట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దారిలోకి చిరు బామ్మర్ది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రావడం విశేషం. సీఎం జగన్‌కు అల్లు అరవింద్ ఓ విజ్ఞప్తి చేశారు.
‘సినిమాలు విడుదల చేయడానికి కొన్ని ఇబ్బందులున్నాయి. వాటిని పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను. రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? దయచేసి చిత్రపరిశ్రమ సమస్యలను అర్థం చేసుకుని, వెసులుబాటు కలగజేయాలి. దీన్ని ఇండస్ట్రీ విన్నపంగా తీసుకుని, సాయపడతారని కోరుకుంటున్నా’ అని అల్లు అరవింద్ సీఎం జగన్‌ను కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి కాకుండా, స్నేహహస్తాన్ని అరవింద్ చాచడం విశేషం. జగన్ ప్రభుత్వాన్ని చిత్ర పరిశ్రమ వేడుకోవడాన్ని అరవింద్ విన్నపంలో చూడొచ్చు.