వైసీపీ ఎలా కోరుకుంటే అలా యుద్ధం చేస్తానని జనసేనాని ప్రకటించడం చర్చకు దారి తీసింది. పవన్ హెచ్చరికలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నిక రూపంలో ఓ మినీ సమరం జరగనుంది.
పవన్‌కల్యాణ్ ప్రకటనను లైట్ తీసుకున్న వైసీపీ తన పని తాను చేసుకుపోతున్నది. అది ఉప ఎన్నికా, మరొకటా అని కాకుండా, ఎన్నికలను ఎన్నికలగానే చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
యుద్ధంలో ప్రత్యర్థులను మట్టి కరిపించడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవడంతో పాటు చుట్టూ మోహరింపజేసేందుకు ఓ సైనికుడిగా వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడాన్ని గమనించొచ్చు.
బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రులు, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. బద్వేలు ఉప ఎన్నికను ఎలా ఎదుర్కోవాలో తన మనసులో మాటను పంచుకున్నారు.
“ఎక్కడా అతి విశ్వాసం వద్దు. కష్టపడి ప్రజామోదాన్ని పొందాలి. ఎన్నికల బాధ్యులు గ్రామస్థాయి పార్టీ నాయకులతో కలిసే ప్రచారం నిర్వహించాలి. ప్రతి ఇంటికీ మూడు నాలుగుసార్లయినా వెళ్లి ఓట్లు అభ్యర్థించాలి” అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించారు.
ఉప ఎన్నిక సమన్వయ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీలు వైఎస్ అవినాష్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబునాయుడిని స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో చావు దెబ్బతీసిన సంగతి తెలిసిందే.
అలాగే మండలానికి ఇన్‌చార్జ్‌లుగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను చొప్పున నియమించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యుద్ధమంటే ఎన్నికల్లో తలపడడడే. ఎన్నికల్లో ప్రజాదరణ పొందేందుకు… అంతకు ముందు చాలా పోరాటం చేయాల్సి వుంటుంది,
రాజకీయం అనేది నిత్యం ఒక యుద్ధమే. ప్రజాపోరాటాల్లో భాగంగా ప్రభుత్వ అణచివేత, నిర్బంధాల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. కావున ప్రజాస్వామ్యంలో యుద్ధం అనేదానికి నిర్వచనం ఏంటో పవన్ ముందుగా తెలుసుకోవాలి. దానికి అర్థమేంటో తెలియాలంటే తాను సవాల్ విసురుతున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూసి పవన్ నేర్చుకోవాలి.