అంటే…నాని మార్కెట్ కు ఏమైంది?

అంటే సుందరానికి మరో కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ ఇప్పటి వరకు చూస్తుంటే సినిమాకు ఎందుకు బజ్ రావడం లేదన్నదే సినిమా సర్కిళ్లలో భయంకరమైన ప్రశ్నగా వుంది. దానికి తోడు అడ్వాన్స్…

అంటే సుందరానికి మరో కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ ఇప్పటి వరకు చూస్తుంటే సినిమాకు ఎందుకు బజ్ రావడం లేదన్నదే సినిమా సర్కిళ్లలో భయంకరమైన ప్రశ్నగా వుంది. దానికి తోడు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అలాగే వున్నాయి. గట్టిగా పదిశాతం టికెట్ లు తెగలేదు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్. ఆ తరువాత అయినా బుకింగ్ లు జోరందుకుంటాయేమో చూడాలి.

నాని నటించిన రెండు సినిమాలు ఓటిటికి వెళ్లాయి. అలా వెళ్లి అవి బతికిపోయాయి అన్నది అంగీకరించాల్సిన వాస్తవం. అంతకు ముందు జెర్సీ మంచి సినిమా కానీ ప్రాఫిటబుల్ సినిమా కాదు. కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాదు, లాభాల్లో వాటా అని ముందు అనుకున్నా, హీరో నాని కి రెమ్యూనిరేషన్ మేరకు అదనంగా ఇవ్వాల్సి వచ్చింది.

శ్యామ్ సింగ రాయ్ తో నాని కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో అంటే సుందరానికి సినిమా విడుదల కాబోతోంది. ఇప్పుడు ఇది కమర్షియల్ సక్సెస్ కావాల్సిందే. ఎందుకంటే దీని తరువాత దసరా సినిమా నాని రెగ్యులర్ మార్క్ సినిమా కాదు. పైగా అరవై కోట్ల భారీ బడ్జెట్. ఈ ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద కొంత మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అంటే సుందరానికి ప్రామిసింగ్ గా లేకపోతే కష్టం అవుతుంది.

అంటే సుందరానికి ఆంధ్ర ఏరియాను (సీడెడ్ కాకుండా) 12 కోట్ల రేంజ్ లో అమ్మాలనుకున్నారు. కానీ విడుదల దగ్గరకు వచ్చాక దాన్ని 10 కోట్లకు తగ్గించారు. ఇప్పుడు ఈ ఫీట్ ను దాటితేనే నాని రేంజ్ నిలబడుతుంది. బుకింగ్ లు చూసి బయ్యర్లు టెన్షన్ పడుతున్నా, మైత్రీ సంస్థ కాబట్టి అమ్మకాల విషయంలో సమస్య రాదు.