ఆంధ్రప్రదేశ్‌లో పగటి కలల పర్వం నడుస్తోంది. ఎవరికి వాళ్లు బలాన్ని అతిగా వూహించుకుని వాస్తవాల్ని మరుస్తున్నారు. కుప్పం సహా 175 గెలుస్తామని జగన్, జగన్ వ్యతిరేకతతో సునాయాసంగా గెలుస్తామని బాబు, పవన్ పగటి కలల్లో వున్నారు. కాసేపు కలల్ని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలోకి వద్దాం.
సీఎం జగన్ 175 గెలుద్దాం, తర్వాత బాబుకి, రామోజీరావుకి ఏజ్ అయిపోతుంది అన్నట్టు ఆంధ్రజ్యోతిలో వార్త. రహస్య చెవులతో రకరకాల వార్తలు రాయడం జ్యోతి ప్రత్యేకత. అలాగని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. షర్మిల పార్టీ పెడుతుందని వార్త వస్తే, మొదట్లో గాలి వార్త అనుకున్నారు. అదే షర్మిలతో ఏబీఎన్ ఆఫీస్‌లో ఇంటర్వ్యూ చేయడం రాధాకృష్ణ గొప్పతనం. రాజకీయాల్లోనే కాదు, జర్నలిజంలో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరు. వైఎస్ కుటుంబానికి సరిపడని ఆంధ్రజ్యోతిలో షర్మిల ప్రత్యేక ఇంటర్వ్యూ రావడమే దీనికి ఉదాహరణ.
జగన్ విషయానికి వస్తే కుప్పం మున్సిపాలిటీ గెలవడం వైసీపీ బలానికి గీటురాయి కాదు. ఎన్ని ఒత్తిడులు, ప్రలోభాలు, బెదిరింపుల మధ్య స్థానిక ఎన్నికలు జరిగాయో అందరికీ తెలుసు. స్థానిక ఎన్నికలు ఎపుడూ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వుంటాయి. ఉప ఎన్నికలూ అంతే. నంద్యాలలో రోజుల తరబడి వుండి వీధివీధి తిరిగి కూడా జగన్ తన అభ్యర్థిని గెలిపించలేకపోయాడు. అదే నంద్యాలలో అసెంబ్లీకి సునాయాసంగా గెలిచాడు.
రేపు కుప్పంలో చంద్రబాబునాయుడిని ఓడించినా కూడా పార్టీకి 175 సీట్లు రావు. ఇన్నేళ్లుగా సరైన అభ్యర్థిని దించకపోవడం వల్ల బాబు సునాయాసంగా గెలుస్తూ వచ్చాడు. గట్టి పోటీ పెడితే ఏమైనా జరగొచ్చు. రాజకీయాల్లో ఓటమి సహజమే. ఇందిరాగాంధీ , ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ అందరూ ఓడిపోయిన వాళ్లే.
వాస్తవం ఏమంటే వైసీపీకి వ్యతిరేకత ఒక రేంజ్‌లో వుంది. అధికార పార్టీకి ఇది తప్పదు కూడా. హార్డ్ కోర్ అభిమానులు తప్ప, ఉద్యోగులు, పెన్షన్‌దారులు వైసీపీ వైపు లేరు. పోలీసులు గాలిని బట్టి వుంటారు. వాళ్లకి ప్రత్యేక అభిమానాలుండవు. గతంలోలా జగన్‌ని ఎలాగైనా సీఎం చేయాలనే ఆవేశంలో యువత లేదు. తమకేమీ న్యాయం జరగలేదనే అసంతృప్తితో కార్యకర్తలున్నారు. చిన్నాచితకా నాయకులు భూదందాలతో పార్టీకి చెడ్డపేరు తెచ్చారు. ఊరట కలిగించే అంశం ఏమంటే మంత్రులపై స్కాంలు లేవు. వాళ్లకి పవరే లేకపోతే స్కామ్స్ ఎలా చేస్తారనే వాదన కూడా వుంది.
పథకాల లబ్ధిదారుల్లో కూడా అసహనం, అసంతృప్తి వుంది. సరుకుల ధరలు, పెట్రోల్ వాళ్ల కొనుగోలు శక్తిని తగ్గించాయి. దీనికి జగన్ కారణం కాకపోయినా, కోపం పాలకుల మీదే వుంటుంది. అయితే చంద్రబాబు వస్తే పథకాలు ఆపేస్తాడనే భయం వుంది కాబట్టి, సాలీడ్‌గా ఈ ఓటు బ్యాంక్ జగన్ వెంటే వుండొచ్చు. జగన్ విశ్వాసం కూడా ఇదే.
ఒకవేళ ఈ రెండేళ్లలో ఏమైనా అద్భుతాలు జరిగి, పరిస్థితుల్ని జగన్ చక్కదిద్దినా, ఆయన వ్యతిరేక ఓటు చీలిపోయినా కూడా జగన్ ఈ సారి 100 సీట్ల దగ్గర ఆగిపోతాడని అంచనా. మంత్రులు, మాజీ మంత్రులు అనేక మందికి ఈ సారి ఎదురీత తప్పదు. క్షేత్రస్థాయి వాస్తవాన్ని గుర్తించకుండా 175 గెలుస్తామని పగటి కలలు కంటే మునిగిపోతారు.
బాబు, రామోజీ ముసలి వాళ్లు అయిపోతారని, ఒకవేళ జగన్ చెప్పి వుంటే లేదా మనసులో అనుకున్నా అది అమాయకత్వమే. ప్రత్యర్థుల వయసు అయిపోతే రాజకీయాల్లో ఎదురు లేదనుకోవడం భ్రమ. కాలం ఎప్పుడూ ఒక కొత్త నాయకుడిని సృష్టిస్తుంది. జగన్ కూడా అలాగే వచ్చాడు.
ఇక చంద్రబాబు పగటి కలలు చూద్దాం. బాబు నిద్రపోయి కలలు కంటే, ఆ కలలకి రాధాకృష్ణ సాన బెడతాడు. బాబు బ్లాక్ అండ్ వైట్‌లో కలలు కంటే ఆంధ్రజ్యోతి దానికి రంగులు అద్దుతుంది. 2019లో కూడా ఇలాగే చంద్రన్న వస్తున్నాడంటూ టీడీపీకి అమావాస్య తెచ్చారు. అయితే ఆంధ్రజ్యోతికి ఇక్కడ ఇంకో ఆప్షన్ లేదు. బాబుని పొగుడుతూ, జగన్‌ని తిడుతూ వుండాల్సిందే. సాక్షి జగన్‌కి ఎలాగో, బాబుకి ఆంధ్రజ్యోతి అలా. ఈనాడు చాలాసార్లు బ్యాలెన్స్ చేసుకుంటుంది. మొగ్గు టీడీపీ వైపే ఉన్నా జ్యోతి అంత అగ్రసీవ్ కాదు. జ్యోతి బ్రేకులు లేని బండి. గెలిస్తే రేస్‌లో కప్పు, ఓడితే యాక్సిడెంట్.
జగన్‌కి వ్యతిరేకంగా ఉన్న చానళ్లు, పత్రికలు ఏం చేస్తున్నాయంటే జగన్ వ్యతిరేకత ఎక్కడ చూసినా టన్నులు టన్నులు ఉందని చెబుతున్నాయి. కార్మికులకి పనుల్లేవు, కాంట్రాక్టర్లకి బిల్లులు లేవు, తాగాలంటే లిక్కర్ దొరకదు, తిందామంటే ధరలు పెరిగాయి. నడుద్దామంటే రోడ్లు లేవు. జగన్ వల్ల అంతా సర్వనాశనం. ఈ క్షణాన ఎన్నికలు వస్తే జనం జగన్‌ని దించి, బాబుని ఎక్కిస్తారు.
చివరికి ఈ ప్రాపగండ ఏ స్థాయికి వెళ్లిందంటే ఈ మధ్య జగన్ ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఒక ట్రాక్టర్ డీజిల్ లేక ఆగిపోయింది. అది చూసుకోవాల్సింది ఎవరో టెక్నీషియన్. వాడి తప్పు కూడా జగన్ నెత్తికి చుట్టడమే. జగన్ జెండాలు వూపి అనేక అంబులెన్స్‌లు, బోర్ మిషన్లు ప్రారంభించారు. ఆ పథకం వల్ల ఉపయోగాలు కూడా వుంటాయి కదా, అవి రాయరు. నాడు-నేడులో అవకతవకలు జరిగినా, అనేక స్కూళ్లు రూపం మార్చుకున్నాయి. అవి రాయరు. ఎక్కడో కరెంట్ పోతే దానికి జగనే కారణం. అంటే ముఖ్యమంత్రి ఒక లైన్‌మన్‌కి ఫోన్ చేసి కరెంట్ తీయించేసినట్టు వార్తలుంటాయి.
జగన్ బటన్ నొక్కి పంచిన లక్ష కోట్ల రూపాయాలు ఏమైంది? మద్యం దుకాణాల ద్వారా మళ్లీ జగనే తీసేసుకున్నాడని ఆరోపణలు. అంటే అంతకు ముందు మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులు లేవా? బ్రహ్మాండంగా వున్నాయి. కాకపోతే ఆదాయంలో సింహభాగం లిక్కర్ మాఫియాకి వెళ్లేది. ఇపుడు మాఫియా లేదు. ప్రభుత్వమే మాఫియా అని కూడా అంటున్నారు. కానీ ప్రభుత్వం డబ్బులు, పథకాల రూపంలో జనానికి అందుతున్నాయి కదా, దీన్ని కాదనలేరు.
ఎకనామిక్స్‌లో సింపుల్ సూత్రం ఏమంటే నీ దగ్గరున్న వంద రూపాయలు వెయ్యి చేతులు మారితే దాని కొనుగోలు శక్తి లక్ష రూపాయలు. వంద నీ దగ్గరే ఆగిపోతే అది బ్లాక్ మనీ. అంటే నీ దగ్గరున్న వందని కిరాణా వాడికి ఇస్తావు. వాడు మెడికల్ షాపుకి, వాడు ఇంకొకరికి ఇలా డబ్బు చేతులు మారితే అది అనేక అద్భుతాలు చేస్తుంది.
జగన్ పంచిన లక్ష కోట్లని అవసరాలకి ఖర్చు పెట్టే వాళ్లు తప్ప, దాన్ని దాచుకునే శక్తి వాళ్లకు లేదు. లక్ష కోట్లు ఎన్ని లక్షల కోట్టుగా మారి వుంటుందో ఊహించుకోవచ్చు. అదే డబ్బు కాంట్రాక్టర్లకి పంచితే వాళ్ల బంగళాలు, బంగారం, కార్లుగా మారుతుంది తప్ప సామాన్యుల మధ్య వుండదు.
అయితే రాష్ట్ర ప్రయోజనాలని వదిలేసి డబ్బులు పంచడం కరెక్టా? ప్రజలు సోమరులుగా మారుతారు కదా, అనర్హులుకి అందుతున్నాయి. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు వున్నాయి, వుంటాయి కూడా. అందుకే కదా జగన్ మీద వ్యతిరేకత. మౌలిక వసతులు విస్మరించి ఓట్ బ్యాంక్ సంక్షేమ మంత్రం పాటిస్తే రాష్ట్రం ఏదో ఒక రోజు మునిగిపోతుంది. జీతాలు ఒకటి నుంచి ఏదో ఒక తేదీకి వెళ్లాయి. కొంత కాలానికి రెండు నెలలకోసారికి వస్తాయి.
అయితే వ్యతిరేకతని నమ్మి జనం తనని గెలిపిస్తారని అనుకోవడం బాబు భ్రమ. ఎందుకంటే చంద్రబాబు పాలనలో ఒరిగిందేమీ లేదు. ఇది ఆల్రెడీ జనానికి తెలుసు. కొత్తగా ఏదో అద్భుతాలు చేస్తాడనే ఆశ ఎవరికీ లేదు. జగన్ వుంటే కనీసం పథకాల డబ్బులైనా ఇస్తాడు. బాబు వస్తే ఉన్నవి ఊడగొట్టి, మళ్లీ సింగపూర్, జపాన్, మలేషియా అంటూ గ్రాఫిక్స్ చూపిస్తాడు.
టీడీపీ నాయకుల ప్రత్యేకత ఏమంటే అధికారంలో వుంటే తోపులు, తురుంఖాన్‌లు. పోతే ఎవరి వ్యాపారాలు వాళ్లు చేసుకుంటారు. ఎన్నికల టైంకి ప్రత్యక్షమవుతారు. దానికి తోడు పోరాడైనా సరే బాబుని సీఎం చేయాలనే కసి ఎవరికీ లేదు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చినా చెమట చిందకుండా నారాయణ, సుజనా, సీఎం రమేష్‌లు చక్రం తిప్పుతారు తప్ప, తమ మొహం చూడరని వాళ్లకి తెలుసు. పార్టీ నిండా ముసలి బ్యాచ్. వారసులుగా వచ్చిన లోకేశ్ లాంటి వాళ్లు తప్ప మిగతా అంతా బిఫోర్ ఎన్టీఆర్. వీళ్లకి కొత్త జనరేషన్ అర్థం కాదు. ఎలక్షన్ తీరు మారిందని తెలియక ఇంకా సాంప్రదాయక రాజకీయాలే చేస్తుంటారు. పాత కంపు టీడీపీ బలహీనత అయితే, కొత్తగా ఆలోచించడం జగన్ బలం.
అయితే ఒకటి నిజం, నీటి బుడగల్ని నమ్మి ఆకాశానికి ఎగరాలని బాబు చూసినా కూడా, ఎన్ని తప్పిదాలు చేసినా కూడా గతం కంటే ఈ సారి ఎక్కువ సీట్లు వస్తాయి. ఒకవేళ పొత్తులన్నీ కుదిరి అధికారంలోకి వచ్చినా టీడీపీ, జనసేన కొట్టుకుచచ్చి మళ్లీ జగనే మేలు అనే స్థితి తెచ్చినా తెస్తారు.
ఇక పవన్ గురించి చెప్పాలంటే ఆయనో కలల మనిషి. రాజకీయం పార్ట్ టైమ్ కాదని ఆయనకి అర్థం కాదు. సభలు పెట్టి చప్పట్లు కొట్టించుకుంటే సీఎం అయిపోరు. ఆయన్ని కుర్చీలో చూడాలనుకునే హార్డ్‌కోర్ ఫ్యాన్స్ వున్నారు. కానీ వాళ్లకి ఎన్నికల యంత్రాంగం గురించి తెలియదు. ఇన్నేళ్ల తర్వాత కూడా పార్టీకే ఒక తలాతోకా లేనప్పుడు కార్యకర్తల్ని , ఫ్యాన్స్‌ని అనడమెందుకు?
లా చదవకపోయినా సినిమాల్లో లాయర్ కావచ్చు. శిక్షణ లేకపోయినా పోలీస్ అధికారి కావచ్చు. ప్రేమికుడు కావచ్చు. నాయకుడు కావచ్చు.
కానీ జీవితంలో ప్రతిచిన్న విషయానికి యుద్ధం చేయాలి. మరి వేటగాళ్లని వేటాడే రాజకీయాల్లో ఎంత యుద్ధం కావాలి? నిద్రపోయే వాన్ని లేపచ్చు, నిద్ర నటించేవాన్ని కూడా లేపచ్చు. ఏది నిద్రో, ఏది మెలకువో తెలియని వాళ్లని ఏమీ చేయలేం. జనానికి పవన్ అర్థం కాడు. పవన్‌కి జనం అర్థం కారు. ఈ ఈక్వేషన్ కుదిరితేనే పవన్‌కి కలగనే చాన్స్ లభిస్తుంది.
జీఆర్ మహర్షి