జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పై ఆయన సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన ఫౌండర్ చేగొండి హరిరామ జోగయ్య జోష్యం చెప్పారు. పవన్‌కల్యాణ్ సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కుటుంబం, సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
హరిరామ జోగయ్య వ్యాఖ్యలు పవన్‌కు రాజకీయంగా నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే జనసేన అంటే కాపుల పార్టీగా ముద్రపడింది. అలాంటిది పవన్ గురించి కాపు నాయకులు పాజిటివ్‌గా మాట్లాడ్డం, ఇదే సందర్భంలో ప్రత్యర్థులపై విమర్శలు చేయడంతో ఇతర సామాజిక వర్గాలకు జనసేనాని శత్రువు అవుతున్నారని చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌ను కాపు నాయకులు పాలించాలని ఎంతో కాలం నుంచి హరిరామ జోగయ్య కలలు కంటున్నారు. అందుకే ఆయన గతంలో చిరంజీవి ప్రజారాజ్యం ప్రకటించగానే, ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత చిరంజీవిపై కోపం వచ్చి ఘాటైన విమర్శలతో బహిరంగ లేఖ రాసి…అందరినీ ఆశ్చర్యపరిచారు. కాపులకు ఆయన అప్పట్లో షాక్ ఇచ్చారు.
జనసేన స్థాపించినప్పటికి పవన్ సీఎం అవుతారని ఆయన చెబుతూ వస్తున్నారు. ఏనాటికైనా పవన్‌కల్యాణ్ సీఎం కాకుండా ఎవరూ ఆపలేరనే ఆయన నమ్మకాన్ని అభినందించాలి. హరిరామ జోగయ్యకున్నంత పట్టుదల, ఆశ పవన్‌లో మచ్చుకైనా కనిపించవు. ఇదే జనసేన పార్టీకి శాపంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా హరిరామ జోగయ్య కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి అవినీతిపరులని ఆయన ఆరోపించారు. ఇందుకు తానే సాక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. జగన్‌ను అభినవ నిత్య అవినీతిపరుడిగా ఆరోపించి పవన్‌కు సంతోషాన్ని కలిగించారు. పవన్‌కు అన్ని వర్గాల్లో విశేష ఆదరణ ఉందన్నారు. అందువల్ల పవన్ తప్పక సీఎం అవుతారని ఆయన అన్నారు.
కాపు సంఘాల పేర్లతో పవన్‌ను సొంత చేసుకునే క్రమంలో, ఇతర సామాజిక వర్గాలకు దూరం చేస్తున్నామనే వాస్తవాన్ని హరిరామ జోగయ్య లాంటి కురువృద్ధులు గుర్తించడం లేదు. పవన్‌పై అభిమానంతో నెత్తికెత్తుకుంటూ, ఇతరులకు దూరం చేయడంలో హరిరామ జోగయ్య లాంటి కాపు నేతలు విజయవంతం అవుతున్నారు. ఇదే జగన్‌కు రాజకీయంగా లాభిస్తోంది.
ఇప్పుడు జగన్‌ను జోగయ్య విమర్శించాల్సిన అవసరం ఏంటో? ఊరికే పవన్‌ను ఆకాశానికి ఎత్తితే ప్రయోజనం లేదనే భావనతో, వైఎస్సార్ కుటుంబ సభ్యులపై రెండు రాళ్లు వేయడం కుల సంఘం నాయకులకు అలవాటుగా మారింది. జనం అన్నీ గమనిస్తున్నారనే నిజాన్ని గమనించకపోవడం వల్లే ఈ సమస్య.