ష‌ర్మిల స్వ‌యంగా కారు న‌డుపుకుంటూ!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల తెలంగాణ‌లో రాజ‌కీయంగా బ‌ల‌ప‌డేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. అయితే తెలంగాణ‌లో ఆమె పార్టీకి చోటు ద‌క్కుతుందా? లేదా? అన్న‌ది వేరే అంశం. ఒక రాజ‌కీయ పార్టీ అధినేత్రిగా…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల తెలంగాణ‌లో రాజ‌కీయంగా బ‌ల‌ప‌డేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. అయితే తెలంగాణ‌లో ఆమె పార్టీకి చోటు ద‌క్కుతుందా? లేదా? అన్న‌ది వేరే అంశం. ఒక రాజ‌కీయ పార్టీ అధినేత్రిగా ఏం చేయాలో, అంత‌కు మించి ఆమె కష్ట‌ప‌డుతున్నారంటే, ఎవ‌రూ కాద‌న‌లేరు. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ జిల్లాలో పాద‌యాత్ర చేస్తుండ‌గా త‌న వాహ‌నాల అద్దాలు ధ్వంసం చేయ‌డం, బ్యాన‌ర్ల‌ను కాల్చేయ‌డంపై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వ‌రంగ‌ల్‌లో దాడి నేప‌థ్యంలో ఆమె వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ల‌డం ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. త‌న పాద‌యాత్ర‌పై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని నిర‌సిస్తూ…  మంగ‌ళ‌వారం ఆమె ఏకంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ ముట్ట‌డికి బ‌య‌ల్దేరారు. లోట‌స్‌పాండ్ నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పోలీసుల క‌ళ్లు గ‌ప్పి , ఆమే స్వ‌యంగా అద్దాలు ధ్వంస‌మైన కారు న‌డుపుకుంటూ వెళ్ల‌డం విశేషం.

పంజాగుట్ట సర్కిల్ దాటి ప్రగతి భవన్‌ వైపు  వెళ్తుండగా ష‌ర్మిల‌ను పోలీసులు గుర్తించారు. ష‌ర్మిల వాహ‌నం ముందుకు క‌ద‌ల‌కుండా, ఎదురుగా పోలీసులు కార్లు, ఆటోల‌ను నిలిపారు. కారులో ఉన్న ష‌ర్మిల అద్దాల‌ను మూసేసుకుని పోలీసుల‌తో మాట్లాడేందుకు నిరాక‌రించారు. వైఎస్సార్‌టీపీ కార్య‌క‌ర్త‌లు ష‌ర్మిల కారు చుట్టూ నిలిచి ఆందోళ‌న‌కు దిగారు.

కేసీఆర్ స‌ర్కార్ నిరంకుశ వైఖ‌రిని నిర‌సిస్తూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించ‌డంతో ష‌ర్మిల కారును క్రేన్ సాయంతో పోలీసులు త‌ర‌లించారు. ఆ స‌మ‌యంలో కారు లోప‌ల ష‌ర్మిల ఉండ‌డం గ‌మ‌నార్హం.