ఇది పచ్చమేధావుల అత్యుత్సాహం!

తండ్రీకొడుకులు తెగ రెచ్చిపోతున్నారు. తల ఎక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ అంటూ తండ్రి ఓ మాటంటే.. ‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి.. అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి..’ అంటూ చినబాబు కూడా తన వంతు…

తండ్రీకొడుకులు తెగ రెచ్చిపోతున్నారు. తల ఎక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ అంటూ తండ్రి ఓ మాటంటే.. ‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి.. అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి..’ అంటూ చినబాబు కూడా తన వంతు రెచ్చిపోతున్నారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను కడప కోర్టు నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో అక్కడికేదో జరగిపోయినట్లుగా పచ్చదళం విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. కడపకోర్టు విచారణకు హాజరు కావడానికి వివేకా కుటుంబానికి వేర్వేరు సమస్యలుండవచ్చు. వారి విజ్ఞప్తి మేరకు తెలంగాణకు మార్చి ఉండవచ్చు. అంతమాత్రాన మధ్యలో జగన్ ను లాగి ఎందుకు నిందిస్తున్నారనేది.. లాజిక్ కు అందని ప్రశ్న!

వివేకా హత్యకేసును సీబీఐ విచారిస్తోంది. దీనికి సంబంధించిన విచారణ కడపకోర్టులో జరుగుతోంది. దర్యాప్తు సంస్థ రాష్ట్రపోలీసులు అయినంత కాలమూ.. జగన్మోహన్ రెడ్డి విచారణను ముందుకు సాగనివ్వడంలేదంటూ అందరూ అవాకులు చెవాకులు పేలారు. దర్యాప్తు సీబీఐకు మారింది. జగన్ మీద నిందలు వేయడానికి ఎవ్వరికీ ఏమీ అవకాశం దొరకడం లేదు. న్యాయవ్యవస్థను కూడా జగన్ ప్రభావితం చేస్తున్నాడన చెప్పడానికి అవకాశం లేదు. 

ఎందుకంటే.. జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులనుంచి బోలెడు తీర్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ కోర్టు తెలంగాణకు మారగానే..జగన్ మీద తిరిగి బురద చల్లడానికి ఇంకో కొత్త సాకు దొరికిందని ఈ పచ్చదళాలకు పెద్ద పండగగా ఉన్నట్టుంది.

సీబీఐ దర్యాప్తులో ఇలా చెప్పారు.. అలా చెప్పారు.. అంటూ జగన్ కు వ్యతిరేకంగా ఏమైనా వివరాలు వెల్లడైనప్పుడెల్లా పచ్చమీడియా తాటికాయంత అక్షరాలతో రాస్తుంటుంది. అదే సమయంలో అదే దర్యాప్తులో నిందితుల తరఫు వ్యక్తులు వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసినా.. తమను ఎలా ఇరికించారో వాదన చెప్పినా వాటికి మీడియాలో ప్రాధాన్యం దక్కదు. ఇలా వక్రరాతలు రాస్తున్న మీడియా.. ఇప్పుడు పచ్చమేధావులకు తోడవుతోంది. 

కోర్టు విచారణ కూడా పూర్తయి.. పచ్చదళం మొత్తం కోరుకుంటున్నట్టుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి శిక్ష పడితే కూడా.. దానికి జగన్ కు ముడిపెట్టి మాట్లాడడం సబబు అనిపించుకోదు. కానీ.. అసలేమీ లేకుండానే.. ఆలూలేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా.. జరిగిన హత్యకు సంబంధించి.. ఏమీ తేలకుండానే.. జగన్ కు బురద పులమాలని చూడడం వీరి అసహ్యమైన వైఖరికి నిదర్శనంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. 

కేసు విచారణ తెలంగాణ కోర్టుకు తరలిపోయినంత మాత్రాన పచ్చపార్టీ కోరుకున్నట్టుగా జరగదని, న్యాయం మాత్రమే బయటకు వస్తుందని ప్రజలు అంటున్నారు.