రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన రోజే మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. గురువారం రాత్రి క్రితం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కేవలం వారం మాత్రమే ఎన్నికల వ్యవధి ఉండడం గమనార్హం.
ఈ నెల 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 9న అవసరమైతే రీపోలింగ్ నిర్వహిస్తారు. 10న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
ఈ రోజు సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఆమె జిల్లా ఉన్నతాధికారులు, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం రాజకీయ పార్టీలతో నీలం సాహ్ని సమావేశం కానున్నారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఆమె అభిప్రాయాలు తీసుకోనున్నారు.