జంట నగరాలు అంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేవి హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే. ఈ రెండూ కూడా తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి రెండు కళ్ళుగా ఉంటూ వస్తున్నాయి.
మళ్ళీ అలాంటి ఆలోచన ఎవరూ వేరే చోట చేసినట్లుగా ఎక్కడా కనిపించదు. ఇపుడు ఆ కాన్సెప్ట్ ని జగన్ ఏపీలో అమలు చేయాలనుకుంటున్నారు. అది కూడా పాలనా రాజధానిగా ఉన్న విశాఖలో దానిని చేసి చూపించాలని కూడా అనుకుంటున్నారు.
విశాఖ ఎటూ మెగా సిటీగా ఉంది. ఇక రాజధాని అయ్యాక మరింగా ప్రగతిపధంలో దూసుకుపోవడం ఖాయం. అదే సమయంలో విశాఖలో రూరల్ జిల్లాగా ఉన్న అనకాపల్లి ప్రాంతం వ్యాపార కేంద్రంగా ఉంది. దాంతో విశాఖ అనకాపల్లిలను జంట నగరాలుగా అభివృద్ధి చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీని మీద అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమరనాధ్ మాట్లాడుతూ విశాఖ జిల్లావ్యాప్తంగా అభివృద్ధి ఫలాలు పంచాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెప్పారు. అదే సమయంలో అనకాపల్లిని మరో మెగా సిటీగా రూపుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోందని కూడా వెల్లడించారు. మొత్తం మీద చూస్తే ఏపీలో కూడా జంట నగరాలు ఇక మీదట కనిపిస్తాయన్నమాట.