సిద్ధూ రాజీనామాతో.. అమ‌రీంద‌ర్ రాజీ కొస్తారా?

ముందుగా సిద్ధూ కోరుకున్న‌ది జ‌రిగింది. ఆ త‌ర్వాత అమ‌రీంద‌ర్ కోరుకున్న‌ది జ‌రిగింది. ఈ వ‌ర‌స ఎపిసోడ్ల‌తో మొన్న‌టి వ‌ర‌కూ పందెం కోళ్ల‌లా త‌ల‌ప‌డిన ఇద్ద‌రు నేత‌లూ ప‌ద‌వుల‌ను కోల్పోయారు. ఇద్ద‌రూ అస‌హ‌నంతో ఉన్నారు. వీరిలో…

ముందుగా సిద్ధూ కోరుకున్న‌ది జ‌రిగింది. ఆ త‌ర్వాత అమ‌రీంద‌ర్ కోరుకున్న‌ది జ‌రిగింది. ఈ వ‌ర‌స ఎపిసోడ్ల‌తో మొన్న‌టి వ‌ర‌కూ పందెం కోళ్ల‌లా త‌ల‌ప‌డిన ఇద్ద‌రు నేత‌లూ ప‌ద‌వుల‌ను కోల్పోయారు. ఇద్ద‌రూ అస‌హ‌నంతో ఉన్నారు. వీరిలో ఎవ‌రో ఒక‌రిని బుజ్జ‌గించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇద్ద‌రినీ బుజ్జ‌గించాల్సిన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ ఉంది. ఇలా పంజాబ్ పొలిటిక‌ల్ డ్రామా ప‌లు మ‌లుపుల‌తో సాగుతూ ఉంది.

త‌న స్నేహితుల‌ను క‌ల‌వ‌డానికి ఢిల్లీకి అని ప్ర‌క‌టించిన అమ‌రీంద‌ర్ అక్క‌డ అమిత్ షాతో స‌మావేశం అయ్యారు. త‌ద్వారా బీజేపీ వాళ్లే త‌న స్నేహితులు అని ఆయ‌న సందేశం ఇచ్చిన‌ట్టుగా ఉంది. అలాగే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో కూడా సింగ్ స‌మావేశం కానున్నార‌ట‌. ఈ స‌మావేశాల సందేశం.. అమ‌రీంద‌ర్ బీజేపీలోకి చేర‌డ‌మేనా? అనేది చ‌ర్చ‌గా మారుతున్న అంశం. అయితే బీజేపీలోకి అమ‌రీంద‌ర్ చేరినా పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌క‌పోవ‌చ్చు!

బీజేపీ పెట్టుకున్న అంత‌ర్గ‌త 75 యేళ్ల వ‌య‌సు ప‌రిమితిని అమ‌రీంద‌ర్ ఎప్పుడో దాటేశారు. ఆయ‌న వ‌య‌సు 80. మ‌రి త‌న అవ‌స‌రం మేర‌కు బీజేపీ త‌న సిద్ధాంతాల‌కూ తిలోద‌కాలు ఇస్తూనే ఉంటుంది. అమ‌రీంద‌ర్ వ‌స్తే ఇప్పుడు కూడా పంజాబ్ సీఎం అభ్య‌ర్థిగా ఆయ‌న‌ను పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది క‌మ‌లం పార్టీ. అయితే మొన్న‌టి వ‌ర‌కూ సాగు చ‌ట్టాల‌ను అమ‌రీంద‌ర్ తీవ్రంగా వ్య‌తిరేకించారు.

అలాంటిది ఇప్పుడు ఆ చ‌ట్టాల విష‌యంలో బీజేపీ వెన‌క్కు త‌గ్గ‌కున్నా.. అమ‌రీంద‌ర్ అక్క‌డ‌కు చేరితే కామెడీ అయిపోతారు. అలాగే పంజాబ్ లో ద‌ళితుడిని సీఎంను చేస్తామంటూ బీజేపీ ప్ర‌క‌టించుకుంటోంది. ఇప్పుడు అమ‌రీంద‌ర్ రాగానే పాగా మార్చేస్తే బీజేపీ మ‌రింత విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికిప్పుడు అమ‌రీంద‌ర్ ను చేర్చుకున్నా.. పంజాబ్ లో బీజేపీ ఎంత వ‌ర‌కూ బ‌లోపేతం అవుతుంద‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇక సిద్ధూకు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేజారిన‌ట్టుగా అనిపిస్తోంది.  త‌న బోటి జాట్ సిక్కును డిప్యూటీ సీఎం క‌మ్ హోం మినిస్ట‌ర్ గా చేయ‌డం తో.. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత కూడా సీఎం సీటు విష‌యంలో త‌న‌కు చాలా పోటీ ఉంద‌నే క్లారిటీ వ‌చ్చింది సిద్ధూకు. ఈ నేపథ్యంలో ఆయ‌న అలిగి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి ఈ అలిగేందేందో అమ‌రీంద‌ర్ సీఎంగా ఉన్న‌ప్పుడే అలిగి ఉంటే కాంగ్రెస్ కు అమ‌రీంద‌ర్ అయినా మిగిలే వాడు. ఇక ద‌ళిత సీఎంను పీఠం ఎక్కించ‌గానే.. జాట్ సిక్కులు తీవ్ర అస‌హ‌నానికి లోన‌వుతున్నార‌నే టాక్ కూడా మొద‌ల‌య్యింది.  అమ‌రీంద‌ర్ ను బుజ్జ‌గించ‌డానికి ఒక బ్యాచ్ ను, సిద్ధూను బుజ్జ‌గించ‌డానికి మ‌రో బ్యాచ్ ను రెడీ చేసింద‌ట కాంగ్రెస్ హైక‌మాండ్. మ‌రి వీరిలో ఎవ‌రు బుట్ట‌లో ప‌డ‌తారో!