గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో ఓ విషయం వినిపిస్తోంది. రాబోయే జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలను ఏదో ఒక సాకుతో తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తుందని.
పార్టీ పరువు మరింత దిగజారడం ఇష్టం లేక, దౌర్జన్యాలు, ఏకపక్షం లాంటి పదాలు వాడి ఈ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ వర్గాల్లో ముందుగానే వినిపించింది. అదే ఇప్పుడు నిజమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహారాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగవన్న విషయాన్ని తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది వార్తల సారాంశం.
వాస్తవానికి తిరుపతి ఎన్నిక కూడా బహిష్కరించాలన్న ప్రతిపాదన కొందరు నాయకులు స్థానిక ఎన్నికల ఫలితాల అనంతరం చేసారని బోగట్టా. అయితే అప్పటికే అభ్యర్థి పేరు ప్రకటించేసినందున, వెనక్కు తగ్గితే బాగోదని ఆలోచించినట్లు తెలుస్తోంది.
కానీ జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ అన్న వార్త అధికారికంగా బయటకు వస్తే, ఎన్ని కారణాలు చెప్పినా జనం రాంగ్ గానే అర్థం చేసుకునే అవకాశం వుంది.