దక్షిణాది చిత్రపరిశ్రమలో మణిరత్నం పేరుకు తగ్గట్టే రత్నం లాంటి దర్శకుడు. ఆయన సినిమాలు జయాపజయాల విషయాన్ని పక్కన పెడితే….ప్రతి సినిమాకు ఓ అర్థం పరమార్థం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే దర్శకుల్లో ఆయన ఒరవడి, మార్గం ప్రత్యేకం.
మారుతున్న కాలానికి తగ్గట్టు తనలో మార్పునకు శ్రీకారం చుట్టారాయన. తాజాగా ఆయన ఓ వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేశారు. ఈ సిరీస్‌తో ఆయన ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏకంగా తొమ్మిది మంది హీరోలను తెరపైకి తీసుకురానున్నారు. అంతే కాదండోయ్…ప్రతి ఎపిసోడ్‌కు ఒక్కొక్కరు దర్శకత్వం వహించడం ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత.
ఈ తొమ్మిది ఎపిసోడ్లకు దర్శకుల ఎంపిక కూడా పూర్తయింది. దర్శకులుగా నటులు అరవింద్ స్వామి, సిద్ధార్థ్‌లతో పాటు గౌతం మీనన్, బిజోరు నంబియార్, సుధ కొంగర, కెవి ఆనంద్, జయేంద్ర, కార్తీక్ నరేన్ ఎంపికయ్యారు.
ఇక హీరోల విషయానికి వస్తే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రనటులతో చేయడానికి మణిరత్నం ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇప్పటికే నాగార్జున, నాని, ఫహద్ ఫాజిల్, నాగచైతన్య తదితర హీరోలతో మణిరత్నం సంప్రదించారని సమాచారం. ఏది ఏమైనా మణిరత్నం మార్క్ వెబ్ సిరీస్‌లో ఉండడం ఖాయం.