సినిమా వాళ్లలో తనంతటి మంచిది మరొకరు లేరు, తనంతగా పోరాడి ఎదిగిన వారు లేరు, తనంతగా వేధింపులకు లోనయిన వారు లేరు.. అని పదే పదే చెప్పుకోవాలని ప్రయత్నిస్తోంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఒకవైపు సానుభూతి పొందాలని, మరోవైపు అహాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా ఉంటుంది ఈమె తీరు. బాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్లను, దర్శకులను ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటుంది కంగనా. ఆమె కన్నా ఎక్కువగా ఆమె సోదరి రంగోలీ అందరినీ తూలనాడుతూ ఉంటుంది.
నెపొటిజం అన్నారు, బంధు ప్రీతిని ఎండగట్టారు. అంత వరకూ కంగనా అభినందనీయురాలే. తనను ఇండస్ట్రీలో తీవ్రంగా వేధించారని, మానసిక-శారీరక వేధింపులకు పాల్పడ్డారని, అవకాశాలను ఇప్పిస్తామంటూ తనను వాడుకున్నారని ఓపెన్ గా చెప్పింది కంగనా. ఈ రకంగానూ ఆమె గట్స్ ఒప్పుకోదగినవే. అన్యాయానికి గురైన చాలా మంది బయటకు చెప్పుకోలేని విషయాలను కూడా కంగనా చెప్పుకుంది. ఒకస్థాయికి వెళ్లాకా.. చేదు జ్ఞాపకాలను కొందరు పంచుకోరు. అంతా మంచే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. కంగనా దానికి భిన్నం. ఆ రకంగా ప్రశంసలకు అర్హురాలే.
అయితే కంగనా, ఆమె సోదరి రంగోలీల తీరు కొన్ని సార్లు శృతి మించుతూ ఉంటుంది. ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్లకు అందరూ లోకువే! ఇండస్ట్రీలో నెపొటిజం గురించి విమర్శించారంటే అదో లెక్క. తన లాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన తాప్సీ లాంటి వాళ్లను కంగనా బీ గ్రేడ్ నటి అని వ్యాఖ్యానించడం మాత్రం సబబు గా లేదు. తాప్సీ కూడా గ్లామర్ ఫీల్డ్ లో మొదట్లో చాలా రకాలుగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. చివరకు ఒక స్థాయికి వచ్చింది. ఆమెను ఒక్క మాటతో తీసిపడేసింది కంగనా.
ఈమె తీరు ఎలా ఉందంటే.. తను తప్ప ఇంకెవరూ సొంతంగా- కష్టపడి ఎదగలేదు అన్నట్టుగా! ఈ తీరు ఎవరూ మెచ్చుకునేది కాదు. పదే పదే తనను సినీ ఇండస్ట్రీ మాఫియా తొక్కేసిందని అంటూ చెప్పుకుంటోంది కంగనా. ఒక రోజు ఏడ్చేవారిపై అయితే ఎవరైనా సానుభూతి చూపిస్తారు. ప్రతి రోజూ అదే వ్యథ అన్నట్టుగా ఈమె స్పందిస్తోంది. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత కంగనా మరింత దూకుడు పెంచింది. కొందరైతే సుశాంత్ మరణాన్ని కంగనా తన స్వార్థం కోసం వాడుకుంటోందనే విమర్శలూ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాప్సీ కూడా కంగనా అండ్ కో కు గట్టి సమాధానం ఇచ్చింది. తను బీ గ్రేడ్ యాక్ట్రెస్ అన్న కంగనాను ఉద్దేశించి, ఒకరి మరణాన్ని స్వార్థం కోసం వాడుకునేంత దారుణ మనస్తత్వం తనది కాదని అంటూ కంగనాకు తాప్సీ గట్టి జవాబే ఇచ్చింది.