యుద్దం ఏ హీరోల నడుమ అయినా, ఏయే సినిమాల మధ్య అయినా, విజేత దిల్ రాజే. 2020 సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల వెనుక నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆయన భాగస్వామి. నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్. కృష్ణా లాంటి మరికొన్ని ఏరియాలు కూడా తీసుకుంటారేమో చూడాలి.
అలాగే స్టయిలిష్ స్టార్ బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారవుతున్న అల వైకుంఠపురములో సినిమాకు నైజాం డిస్ట్రిబ్యూటర్. వైజాగ్ వ్యవహారం డిస్కషన్లలో వుంది. రజనీకాంత్ దర్బార్ సినిమాను తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకున్న ముగ్గురిలో దిల్ రాజు ఒకరు. ఇక మిగిలిన సినిమా కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా? ఈ సినిమా కూడా నైజాం, వైజాగ్ దిల్ రాజే చేయడానికి అవకాశం వుంది.
ఆ విధంగా పండగ సినిమాలు అన్నింటి వెనుక ఆయన వున్నారు. అందుకే ఆయన ఏరియాల్లో ఇప్పటి నుంచే థియేటర్ అగ్రిమెంట్లు చేసేస్తున్నారు. బై మిస్టేక్ వేరే వాళ్లు బిజినెస్ కు ఎంటర్ అయినా, దిల్ రాజును కాదని ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సినిమా పేరు పెట్టకుండా, థియేటర్లు అగ్రిమెంట్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. తనకు ఏ సినిమాలు వుంటే వాటిని వేసుకుంటారు. అందువల్ల దిల్ రాజు ఆపరేట్ చేసే ఏరియాలకు సినిమాలను ఆయనకు ఇవ్వాల్సిందే.
మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ రంగం మీద గట్టి పట్టే సంపాదించారు దిల్ రాజు. కొందరు ఇది స్ట్రాటజీ అంటున్నారు. కొందరు ఇది గుత్తాధిపత్యం అంటున్నారు. మరికొందరు ముందుకు వెళ్లి ఇదో మాఫియా అన్నంతగా విమర్శిస్తున్నారు.